సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో మత్స్యకారులకు చేసిందేమీ లేదని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల పట్ల చంద్రబాబుకు ఉన్న ద్వేషాన్ని ఎప్పటికీ మరచిపోమని.. ఆయనను రాష్ట్రంలోని మత్స్యకారులెవరూ నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారులు నిరసనలు చేస్తున్న సమయంలో ‘మీ తోలు తీస్తా.. మీ అంతు చూస్తా’నన్న చంద్రబాబు మాటలను మత్స్యకారులెవ్వరూ మర్చిపోలేదన్నారు. మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల వల్లే రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు. ఒక్క వైఎస్సాఆర్ చేయూత పథకం కింద నాలుగేళ్లలో సుమారు రూ.19 వేల కోట్లు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.1,600 కోట్లు ఇచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.1,600 కోట్లు ఎక్కడ.. ఒక్క చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఖర్చు చేస్తున్న రూ.19 వేల కోట్లు ఎక్కడని ప్రశ్నించారు.
జీవో 217పై తప్పుడు ప్రచారం
జీవో 217పై చంద్రబాబు తప్పుడు ప్రచారంతో మత్స్యకారులను చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ జీవో ద్వారా నీటి వనరులను మత్స్యకారుల నుంచి ప్రభుత్వం లాగేసుకుంటోందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 28 రిజర్వాయర్లలో చేపల్ని వేటాడుకునేందుకు లైసెన్సులు ఇచ్చామన్నారు. 2,833 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు సొసైటీల చేతుల నుంచి దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో 2 హార్బర్లు ఉంటే.. తమ ప్రభుత్వం తీర ప్రాంతంలో జిల్లాకో హార్బర్‌ను కానుకగా ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే 4 హార్బర్లకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించగా.. మరో 4 హార్బర్లకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. కోవిడ్ కష్ట కాలంలోనూ ఆక్వా రంగం నిలబడిందంటే అది సీఎం జగన్ ఇచ్చిన చేయూత వల్లేనని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు.
‘పాడి’ అభివృద్ధికి రుణ సాయం చేయండి
రాష్ట్రంలో ఏపీ అమూల్ ప్రాజెక్టును మరింత సమర్థంగా అమలు చేయడానికి, 10 వేలకు పైగా ఉన్న మహిళా పాల ఉత్పత్తి సంఘాల బలోపేతానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) ద్వారా రూ.1,362 కోట్ల రుణాన్ని మంజూరు చేయాలని సీదిరి అప్పలరాజు కేంద్రాన్ని కోరారు. కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీ నుంచి జరిగిన జాతీయ స్థాయి వర్చువల్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏపీలో కొత్తగా రూ.50 కోట్లతో తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఏర్పాటు చేయనున్న పశు వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రానికి అనుమతులు మంజూరు చేయాలని, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా గొర్రెలు, మేకలు, పందుల పెంపకానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టుగానే పాడి పశువులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. డెయిరీ డెవలప్‌మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఎ, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సీఈవో టి.దామోదర్ నాయుడు పాల్గొన్నారు.
మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీ లేదు
Published Tue, Sep 7 2021 4:35 AM | Last Updated on Tue, Sep 7 2021 8:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment