వేటకు వేళాయె..రా! | Fishermens hunting started At Konaseema coast Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వేటకు వేళాయె..రా!

Published Sun, Mar 12 2023 3:00 AM | Last Updated on Sun, Mar 12 2023 3:01 AM

Fishermens hunting started At Konaseema coast Andhra Pradesh - Sakshi

ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప వద్ద వలస గ్రామం

సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి.

కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం.

వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్‌ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. 


కోనసీమకు ఎందుకు వలస అంటే.. 
గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్‌ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు  ఉంటోంది.  

స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి 
వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్‌లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు.  

తెల్లవారుజాము నుంచే వేట.. 
నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్‌కతా, హైదరాబాద్‌ మార్కెట్‌లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది.  

ఏటా క్రమం తప్పకుండా.. 
మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ.  
– దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా 
 
మత్స్య సంపద ఎక్కువ 
ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. 
– సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా 
 
మేం పెట్టుబడి పెడతాం 
నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకా­రు­లకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. 
– బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement