నీటిలోనే జాగారం చేసిన నలుగురు మత్స్యకారులు
కాపాడిన తోటి జాలర్లు
వేటపాలెం: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, పొట్టిసుబ్బయ్యపాలెం మత్స్యకారులకు సంబంధించిన బోటు సముద్రంలో సోమవారం రాత్రి బోల్తాకొట్టింది. అందులో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కొండూరు రాములు, పెద్ద కుమారుడు కొండూరు గోవిందు, చిన్నకుమారుడు చిట్టిబాబు, కఠారివారిపాలేనికి చెందిన కఠారి శ్రీను నలుగురు కలిసి సోమవారం సాయంకాలం బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు.
అయితే రాత్రి 8 గంటల సమయంలో వేట సాగించేటప్పుడు అలల తాకిడికి బోటులోకి సముద్రం నీరు పెద్ద మొత్తంలో చేరుకొని తిరగబడింది. అందులో ఉన్న నలుగురు సముద్రం నీటిలో పడిపోయారు. వీరి పై వేట సాగించే వల పడింది. నలుగురు సముద్రం నీటిలోపలకు వెళ్లి వలను తప్పించుకొని ఈతకొట్టుకొంటూ తిరగబడిన బోటు పై భాగానికి ఎక్కి కూర్చున్నారు. వీరి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు నీటిలో పడిపోవడంతో సమాచారం ఇవ్వడానికి వీలు పడలేదు. ఆరు గంటల పాటు తిరగబడిన బోటు పైనే కూర్చున్నారు.
చిన్నగంజాం మండలం, చిన్నంగారివారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన బోటు పై భాగంలో కూర్చొని ఉన్న నలుగురిని గమనించారు. వెంటనే వారిని తమ బోటులో ఎక్కించుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రం నీటిలోనే ఉండిపోయామని మత్స్యకారులు తెలిపారు. వల, బోటు, ఇంజన్‌లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రూ.6.50 లక్షలు నష్ట పోయామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment