మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల చిత్రంలో ఎంపీ బీదా మస్తాన్‌రావు తదితరులు
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల అమలుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ఏపీ ప్రభుత్వ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల కృషి అభినందనీయమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ప్రశంసించారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు భాగస్వామ్యులు కావాలని సూచించారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి హార్బర్ వద్ద సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం మత్స్యకారులు, ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.
కాగా, నందివాడ మండలం రామాపురానికి చెందిన దావీదు, పెదలింగాలకు చెందిన తుమ్మల రామారావు, రవీంద్రబాబు, ప్రవీణ్‌లు కేంద్ర మంత్రికి పరిశ్రమల్లో ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలను వివరించారు. మత్స్యరైతుల ఉత్పత్తిదారుల సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్ర మంత్రి సతీమణి సవితబెన్ రూపాల, కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతుకుమార్ ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, కలెక్టర్ పి.రాజాబాబు, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎల్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment