
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులున్నాయని, దళారుల పెత్తనాన్ని సహించేది లేదని మత్య్స, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. చేపల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని సోమవారం బేగంపేట హరిత ప్లాజాలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు, చేపల చెరువుల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా చేయూతనిస్తుందని చెప్పారు. అన్ని వసతులతో కూడిన హోల్‌సేల్ చేపల మార్కెట్‌ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని చెరువుల వల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు.
వివిధ మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మధ్య విభేదాల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలకు మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసి.. 18 ఏళ్లు నిండిన మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం ఆరు ఉత్తమ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మెమెంటోలు, 15 నూతన సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు.