నారాయణరావు హిందీలో రాయించిన ఉత్తరం- పాకిస్థాన్‌లోని కరాచీలో కోనసీమ మత్స్యకారులు మగ్గిపోతున్న జైలు ఇదే.. (అంతరచిత్రం) పాకిస్థాన్‌లో బందీగా ఉన్న నారాయణరావు
అమలాపురం టౌన్: అది 2018 నవంబర్ 29వ తేదీ. మంగళూరు సముద్ర తీరం నుంచి 22 మంది మత్స్యకారులతో అరేబియా సముద్రంలో చేపల వేటకు బోటు బయలుదేరింది. వీరిలో 20 మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు. మిగిలిన ఇద్దరూ మన జిల్లా వారు. వారు చేపల వేట సాగిస్తున్న బోటు అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి అనుకోకుండా ప్రవేశించింది.
చదవండి: హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత!
అలా ఆ దేశ సముద్ర సరిహద్దు గస్తీ పోలీసులకు ఈ 22 మంది మత్స్యకారులూ పట్టుబడ్డారు. ఆ దేశంలో బందీలుగా మారిపోయారు. ఆ 22 మందిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది గుర్తింపు కార్డులూ సక్రమంగా ఉండటంతో ఆ దేశ చెర నుంచి కొద్ది నెలలకే విడుదలయ్యారు. మన జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన పెమ్మాడి నారాయణరావు, కాట్రేనికోన మండలం గచ్చకాయలపొరకు చెందిన మూదే అన్నవరం ఇంకా ఆ దేశంలో బందీలుగానే మగ్గిపోతున్నారు. వీరికి వేట బోట్ల పరంగా గుర్తింపు కార్డులు లేకపోవడంతో నాలుగేళ్లుగా కరాచీ జైలులో మగ్గుతున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.
హిందీలో ఉత్తరాలు రాయిస్తూ..
ఆధార్ కార్డులో తప్ప నారాయణరావు, అన్నవరం ఫొటోలు తీయించుకున్న సందర్భాలు కూడా అంతగా లేవు. దీంతో వారి పాత ఫొటోలనే చూసుకుంటూ ఆయా కుటుంబ సభ్యులు తమ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. నారాయణరావు, అన్నవరం ఉత్తరాలు రాసేంత అక్షరాస్యులు కూడా కారు. నారాయణరావు మాత్రం హిందీ భాషలో ఎవరితోనో చాటుగా ఉత్తరం రాయించి చివర సంతకాలు చేసి పోస్టు చేయిస్తున్నాడు. అప్పుడప్పుడూ వస్తున్న ఆ ఉత్తరాలను ఇక్కడ హిందీ భాష తెలిసున్న వారితో చదివించుకుని, అతడి కుటుంబీకులు కొంత తృప్తి పడుతున్నారు.
మరో మత్స్యకారుడు అన్నవరం నుంచి అతడి కుటుంబీకులకు అటువంటి ఉత్తరాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల అన్నవరం ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోందని, అతడి పరిస్థితి చూస్తే బాధనిపిస్తోందని తోటి బందీ నారాయణరావు తన కొడుకు దుర్గాప్రసాద్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అన్నవరానికి కుమార్తె మాత్రమే ఉంది. ఆమె ముమ్మిడివరం మండలం కొత్తలంకలో ఉంటోంది. ఆమె కూడా తన తండ్రి కోసం తల్లడిల్లుతోంది.
రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు
రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ‘రిలేషన్ ఫ్యామిలీ లింక్స్’ కార్యక్రమంలో భాగంగా పాక్‌లో బందీ అయిన నారాయణరావుతో కోనసీమలోని అతడి కుటుంబీకులకు ఉత్తరం రాయించి, ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ ద్వారా ఇక్కడి వారికి అందే ఏర్పాటు చేసింది. అలాగే నారాయణరావు కుమారుడు దుర్గాప్రసాద్ కూడా తన తండ్రికి రాసిన ఉత్తరాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ పాక్ చెరలో ఉన్న నారాయణరావుకు పంపించే ఏర్పాటు చేసింది.
నారాయణరావుకు భార్య, కుమారుడు దుర్గా ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. దుర్గా ప్రసాద్ కుటుంబం ఉపాధి నిమిత్తం సొంతూరు పశువుల్లంక నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే అతడు వడ్రంగి మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. ఆ దేశం నుంచి తండ్రి రాసిన ఉత్తరం చూసి, ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమవుతున్నాడు. పాక్ చెర నుంచి తమ వారిని విడిపించి, తమకు అప్పగించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు.
ఎదురు చూస్తున్నాను
నాన్న నారాయణరావు సముద్రంలో బోట్లపై ఇతర రాష్ట్రాల్లోకి కూడా వెళ్లి కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. 2018లో వెళ్లిన నాన్న నెలలు గడస్తున్నా ఇంటికి చేరుకోలేదు. ఆరా తీస్తే పాకిస్థాన్‌కు బందీగా చిక్కుకుపోయాడని ఆరు నెలల తర్వాత తెలిసింది. చాలా బాధపడ్డాం. అప్పటి నుంచీ నాలుగేళ్లుగా నాన్న కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూ అప్పుడప్పుడు నాన్న మాత్రం అక్కడి నుంచి ఉత్తరాలు రాస్తున్నాడు. ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాను. తగిన ఆధారాలు సమర్పించాను.
– పెమ్మాడి దుర్గాప్రసాద్, పాక్ బందీ నారాయణరావు కుమారుడు, వడ్రంగి మేస్త్రి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment