ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి సైన్యంపై విమర్శల యుద్ధానికి దిగారు. కోర్టు నుంచి పలు కేసుల్లో ఉపశమనం లభించడంతో ఇమ్రాన్‌లో నైతిక స్థైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఏడాది మే 9న అరెస్టయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ నాడు చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అయితే హింసాకాండ జరిగిన రోజున పాక్ రేంజర్లు తనను కిడ్నాప్ చేసినందున ఆర్మీ తనకు క్షమాపణ చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు.
ఇమ్రాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా పౌర, సైనిక సంస్థలకు నష్టం కలిగించింది. నాడు ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) అరాచక రాజకీయాలకు పాల్పడినందుకు క్షమాపణలు కోరితే చర్చలు జరపవచ్చని అన్నారు. ఈ ప్రకటన తరువాత బ్లాక్ డే హింసకు ఖాన్ పార్టీ క్షమాపణ చెప్పాలని వివిధ వర్గాల నుండి డిమాండ్లు వచ్చాయి.
డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మే 9న చెలరేగిన హింస విషయంలో క్షమాపణ చెప్పడానికి తన దగ్గర ఎటువంటి కారణం లేదని అన్నారు. నాడు ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్ నుండి మేజర్ జనరల్ నేతృత్వంలోని రేంజర్లు తనను అరెస్టు చేశారని ఖాన్ ఆరోపించారు. హింస జరిగిన రోజున తనను పాక్ రేంజర్లు కిడ్నాప్ చేశారని, అందుకు ప్రతిగా ఆర్మీ తనకు క్షమాపణలు చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment