‘నాన్నా.. ఆ అమ్మాయి నాకోసం ఎంతగానో పరితపిస్తోంది... అందుకే నేను పాకిస్తాన్ వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్లాంను స్వీకరించాను. నేను ఇంటికి తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు. దయచేసి నా కోసం చింతించకండి’.. ఇవి యూపీలోని అలీఘర్‌కు చెందిన బాదల్ బాబు అనే యువకుడు వీడియో కాల్‌లో తన తండ్రితో పలికిన మాటలు.
సోషల్ మీడియా వేదికగా ఓ అమ్మాయిని ప్రేమించి, సరిహద్దులు దాటి, శత్రు దేశానికి చేరుకున్న ఓ యువకుడు వీడియో కాల్‌లో తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాక్ పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి బెయిల్ లభించలేదు. పాక్ యువతి ప్రేమలో పడిన భారతీయ యువకుడు ఇప్పుడు ఆ దేశంలో పడరానిపాట్లు పడుతున్నాడు.
అలీఘర్‌కు చెందిన బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో అక్రమంగా సరిహద్దులు దాటి పాక్ చేరుకున్నాడు. తరువాత జరిగిన పరిణామాలతో డిసెంబర్ నుంచి జైలులోనే ఉన్నాడు. జనవరి 24న బాదల్ బాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. చార్జిషీట్ అందకపోవడంతో అతని బెయిల్ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో తిరిగి అతడిని జైలుకు తరలించారు. ఈ కేసు తరుపరి విచారణ ఫిబ్రవరిలో ఉండనుంది.
బాదల్ తండ్రి కృపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను వీడియో కాల్‌లో న్యాయవాది ఫయాజ్‌తో మాట్లాడినట్లు భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. పాకిస్తాన్ నివాసి సనా రాణి, ఆమె తల్లి ఆహ్వానించడంతోనే తన కుమారుడు పాకిస్తాన్ వెళ్లి , అక్కడ చిక్కుకుపోయాడని కృపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సనాను కలుసుకునేందుకు బాదల్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహావుద్దీన్ జిల్లాలోని మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు.
అయితే సనా అతనిని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. కాగా బాదల్ బాబు వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. దీంతో పాక్ పోలీసులు అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం బాదల్ బాబు యూపీలోని అలీఘర్‌లోని నాగ్లా ఖట్కారి గ్రామ నివాసి. అతనికి ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరూ రోజూ చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.
బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో పాకిస్తాన్ చేరుకున్నాడు. తన గుర్తింపును మార్చుకుని అక్కడే ఉన్నాడు. అయితే గత డిసెంబర్‌లో స్థానికులకు అనుమానం వచ్చి బాదల్ బాబు గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతనిని బహావుద్దీన్ నగరంలో అరెస్టు చేసి, తరువాత కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపారు. విచారణలో బాదల్ బాబు తన నేరాన్ని అంగీకరించాడు. తాను గతంలో రెండుసార్లు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించానని, మూడోసారి విజయం సాధించానని బాదల్ బాబు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?
Comments
Please login to add a commentAdd a comment