పాకిస్తాన్‌లో నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం పలు అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా కనిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మూడో స్థానంలో ఉంది.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ యువ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మద్దతు పలికారు. దీని వెనుకనున్న కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతని పార్టీ పేరు, గుర్తును రద్దు చేశారు. అయితే ఈ పార్టీకి చెందిన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరు స్వతంత్ర అభ్యర్థుల కంటే మెరున ఫలితాలు దక్కించుకోవడం విశేషం.
2022లో ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి తొలగించారు. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టులో ఇమ్రాన్‌ను జైలుకు తరలించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అయితే ఈ ఎన్నికల్లో పాక్ యువత ఇమ్రాన్‌కు మద్దతు పలికింది. పాక్‌లో సైనిక మద్దతుతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్‌కు అండగా నిలిచారు. అయితే ఈ వాదనను పాక్ ఆర్మీ ఖండించింది.
మరోవైపు రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన ఏర్పడిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపడంపై పాక్ యువత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. పాక్‌కు చెందిన న్యాయ విద్యార్థి నైలా ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ‘నేను 2016లో పీటీఐ పార్టీలో చేరాను. 2018లో నా మొదటి ఓటు ఈ పార్టీకే వేశాను. ఇమ్రాన్ ఖాన్ మాటలు నన్ను, నా సహోద్యోగులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. నెల్సన్ మండేలా లాంటి పలువురు నేతలు జైలులో ఉంటూనే తమ సత్తా చాటారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment