ఏపీ మత్స్యకారుల వలలు తగలబెట్టిన తెలంగాణ అటవీశాఖ అధికారులు
విజయపురిసౌత్ (మాచర్ల): పొట్టకూటి కోసం సొంత ఊరు వదిలి సుదూర ప్రాంతంలో చేపల వేట చేస్తోన్న నిరుపేద మత్స్యకారులపై తెలంగాణ అటవీ అధికారులు దాడి చేసి రూ.30 లక్షల విలువైన వలలు, పుట్టీలను దగ్ధం చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కృష్ణా నది సమీపంలో జెండాపెంట వద్ద జరిగింది. స్థానికులైన మత్స్యకారులు జీవనం కోసం కృష్ణా పరివాహక ప్రాంతమైన జెండాపెంట, పెద్దచెరువు తదితర ప్రాంతాల్లో చేపల వేట చేస్తుంటారు. ఇటీవల మార్కాపురం డీఎఫ్‌వో విఘ్నేశ్వర్, తెలంగాణకి చెందిన ఎఫ్‌డీవో రోహిత్‌తో పాటు పలువురు అధికారులు అనుపు జలాశయం వద్ద మత్స్యకారులతో సమావేశం నిర్వహించి కృష్ణా జలాశయంలో సాగర్ నుంచి 45 కి.మీ లోపే చేపల వేట చేయాలని సూచించారు.
నల్లమల అటవీ ప్రాంతంలో పులులతో పాటు ఇతర జంతువులు సంచరిస్తున్నాయని వాటి సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినట్లు పేర్కొన్నారు. తమ 1,000 కుటుంబాలు 40 ఏళ్లుగా సాగర్‌లో చేపల వేట పైనే బతుకుతెరువు సాగిస్తున్నామని, కొంత పరిధిలోనే వేటను సాగిస్తే ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు– అధికారులు మధ్య చర్చలు విఫలం అవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో కొందరు ఫారెస్ట్ అధికారులు మత్స్యకారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అకస్మాత్తుగా అటవీ శాఖ బోటులో జెండాపెంట, పెద్దచెరువు తదితర ప్రాంతాలకు చేరుకొని మత్స్యకారులపై దాడి చేశారు. పెట్రోల్‌తో వలలు, పుట్టీలను దగ్ధం చేశారు. బాధిత మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన చేస్తామని తోటి మత్స్యకారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment