ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అని చేపల ప్రియులు ఆస్వాదించే వార్త..కష్టపడి వేటాడిన మత్స్యసంపదకు చక్కని మార్కెట్ లభించడంతో గంగపుత్రులు ఆనందించే సందర్భం..జిల్లాలో ఇప్పటికే 85 ఫిష్ ఆంధ్ర మినీ ఔట్‌లెట్లను ప్రారంభించిన మత్స్యశాఖ.. త్వరలో నాలుగు సూపర్ షాప్‌లకు శ్రీకారం చుట్టనుంది. మరో రెండు లాంజ్‌లను ఏర్పాటు చేయనుంది. మినీ ఔట్‌లెట్లలో చేపలు విక్రయించగా.. కొత్తగా ప్రారంభించనున్న సూపర్ షాప్‌లలో లైవ్ ఫిష్‌తోపాటు చేపలతో తయారు చేసే వంటకాలను విక్రయిస్తారు. లాంజ్‌లు రెస్టారెంట్లుగా భోజన ప్రియులకు ఆతిథ్యమివ్వనున్నాయి.
అచ్యుతాపురం: మత్స్యకారులకు అండగా ఉంటూ.. మత్స్య సంపదను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వేలాదిమంది మత్స్యకారుల తలరాత మారుతోంది. అంతేకాకుండా ఆహారంలో కీలక పోషకాలు ఉన్న చేపల ఉత్పత్తి, అమ్మకాలకు మరిన్ని మంచి రోజులు వస్తున్నాయి. ఫిష్ ఆంధ్ర నినాదంతో ఇప్పటికే మినీ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉండగా.. అదనపు హంగులతో చేపల షాపులను ఏర్పాటు చేసే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలో 31 మత్స్యకార గ్రామాలు, 12 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 11 వేల 116 మందికి పైగా మత్స్యకారులు జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో చేపల వేటపై ఆధారపడిన వారికి మేలు చేకూరనుంది. విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్న మత్స్యసంపద మార్కెటింగ్‌కు సంబంధించి మరిన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో నాలుగు సూపర్ షాపులు
అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపల విక్రయానికి ఏర్పాటు చేస్తున్న ఫిష్ మినీ ఆంధ్ర షాపులు జిల్లాలో 85 ఉన్నాయి. దీంతో సముద్ర తీరప్రాంతాల్లోనూ, రిజర్వాయర్, నదులు, సరస్సులు, చెరువుల్లో లభించే వివిధ రకాల చేపలకు చక్కని మార్కెటింగ్ సదుపాయం దక్కింది. ఈ క్రమంలోనే జిల్లాలో సూపర్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో షాపును నెలకొల్పేందుకు రూ.20 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం 40 శాతం సబ్సిడీని భరిస్తుంది. ముందుగా అచ్యుతాపురంలో ఒక షాపును, చోడవరంలో మరో షాపును ఏర్పాటు చేయనున్నారు.
ఇక సూపర్ షాపులకు దీటుగా లాంజ్‌లను సైతం రూ.50 లక్షలతో జిల్లాలో రెండు ఏర్పాటు చేయనున్నారు. వీటిని అనకాపల్లి హైవేలో ఏర్పాటు చేయనున్నారు. వేల్యూ యాడ్ చేసి హైజనిక్‌గా చేపల విక్రయం చేపట్టనున్నారు. దిగువ స్థాయి ప్రజల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వారికి అవసరమైన 10 రకాల చేపలు సూపర్, లాంజ్‌లలో దొరకనున్నాయి.
‘సూపర్’ ప్రత్యేకతలివే...
సముద్ర, చెరువు చేపలకు సంబంధించిన శీలావతి, పచ్చబోసు, సముద్ర రకాలు చందువ, కోనాలు, వంజరం వంటి చేపలను లైవ్‌లో అమ్ముతారు. ఇక్కడే ఐస్ తయారీ వ్యవస్థ ఉన్నందున చేపలు ఫ్రెష్‌గా ఉంటాయి. అవసరమైతే ప్యాక్ చేసిన చేపలను అమ్ముతారు. చేపల కట్‌లెట్‌లు, ఫ్రైలు విక్రయిస్తారు.
రెస్టారెంట్‌గా లాంజ్‌లు...
లాంజ్‌లు దాదాపు రెస్టారెంట్ తరహాలో ఉంటాయి. చేపలకు సంబంధించిన అన్ని వంటకాలు ఇక్కడ విక్రయిస్తారు. చేపల స్టార్టర్లు, పులుసులు, చేపల బిర్యానీ, చేపల అన్నం, చేపలతో కూడిన అన్ని రకాల ఆహార పదార్థాలను ఇక్కడ రెస్టారెంట్ తరహాలో వినియోగదారునికి అందిస్తారు.
అందుబాటులో విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు
జిల్లాలో ఫిష్ మినీ ఆంధ్రాలకు తోడు మరో నాలుగు సూపర్ షాపులను ఏర్పాటు చేయనున్నాం. అచ్యుతాపురంలో ఒకటి, చోడవరంలో మరొకటి నెలకొల్పుతున్నాం. రూ.20 లక్షలతో ఏర్పాటు చేసే సూపర్ షాప్‌లతో ఫిషింగ్ వేల్యూ యాడ్ చేస్తాం. షాపు ఏర్పాటులో మత్స్యకారునికి 40 శాతం సబ్సిడీ ఇస్తాం.
–ప్రసాదరావు, జిల్లా మత్స్య శాఖ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment