జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద పూర్తయిన బ్రేక్ వాటర్ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైనవి వాస్తవ రూపం దాలుస్తున్నాయి. వీటి రాకతో ఇక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని వేలాది మంది మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళ్లి, ఎప్పటికప్పుడు ఇంటికొస్తూ.. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే రోజులు అతి త్వరలోనే రానున్నాయని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వారికి ఆ కష్టాలను దూరం చేయాలని భావించి, అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు.
ఇందులో తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. ప్రధానంగా డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, ప్రీకాస్ట్ వంటి పనులు దాదాపు పూర్తయినట్టే. కొద్ది రోజుల్లో మిగతా ఐదు శాతం పనులు పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం పట్టిన చేపలు వేలం వేసుకోవడానికి హాలు, కోల్డ్ స్టోరేజ్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వంటి భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.288.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ హార్బర్‌లో 1,250 బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది. తద్వారా 6,100 మంది మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
9 హార్బర్లతో 60,858 మందికి ఉపాధి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూ.3,520.56 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలి దశ కింద రూ.1522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఇందులో జువ్వలదిన్నె ప్రారంభానికి సిద్ధం అవుతుండగా, నిజాంపట్నంలో 75 శాతం పనులు పూర్తయ్యాయి. మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు కూడా 40 శాతం పూర్తయ్యాయి.
రెండో దశ కింద రూ.1,997.76 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఈ హార్బర్లన్నీ అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60,858 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.
జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అందుబాటులోకి వస్తుందని అంచనా. మత్స్యకారులకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా హార్బర్ల వద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు కసరత్తు చేస్తోంది.
పైలెట్ ప్రాజెక్టు కింద జువ్వలదిన్నె వద్ద 50 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మత్స్య ఉత్పత్తులే కాకుండా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రాసెస్ చేసేలా ఈ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ఇక్కడే ఉపాధి లభిస్తుంది
చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ హర్బర్ వస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందొచ్చు. ఇక్కడ అరుదైన మత్స్య సంపద ఉన్నా, హర్బర్ లేకపోవడంతో తమిళనాడు మత్స్యకారులు దొంగతనంగా వచ్చి వేటాడుతున్నారు. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఆ సమస్య ఉండదు. ఈ హార్బర్ వద్ద ఇతరత్రా మౌలిక వసతులు కూడా కల్పిస్తుండటం సంతోషం.
► బుచ్చింగారి చిట్టిబాబు, మత్యకారుడు, ఆదినారాయణపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
త్వరలో ప్రారంభం
తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నాం. రెండో దశ హర్బర్లకు సంబంధించి డిజైన్లు ఖరారు దశలో ఉన్నాయి. అవి ఖరారు కాగానే పనులు మొదలు పెడతాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హర్బర్ లేదా ఓడరేవు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
► షాన్ మోహన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు
జువ్వలదిన్నెలో పనుల పురోగతి ఇలా..
► 2021 మార్చి 19న పనులు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు.
► భారీ మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఆగడానికి వీలుగా కాలువను తవ్వడం కోసం ఏకంగా 10.5 లక్షల టన్నుల ఇసుకను తవ్వి పక్కన పోశారు. ఈ బ్రేక్‌వాటర్ ఛానల్ తిరిగి పూడిపోకుండా ఉండటం కోసం 3.20 లక్షల టన్నుల రాతిని వినియోగించారు. ఉత్తరం వైపు బేక్ వాటర్ 835 మీటర్లు, దక్షిణం వైపు 620 బ్రేక్ ఛానల్స్‌ను రాతితో నింపే ప్రక్రియ పూర్తయింది.
► అలల ఉధృతిని తట్టుకునే విధంగా సిమెంట్‌తో నిర్మించిన 9,176 ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉండే సిమెంట్ దిమ్మెలు–టెట్రాపాడ్స్ అని కూడా అంటారు) పేరుస్తున్నారు. ఇందులో ఇప్పటికే 6,919 ట్రైపాడ్స్‌ను అమర్చారు. 1,250 బోట్లు నిలుపుకోవడానికి 909 మీటర్ల జెట్టీ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందుకోసం 312 ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ (సముద్రం లోపలికి సిమెంట్‌తో కూడిన ఇనుప దిమ్మెలు) ఏర్పాటు చేశారు.
► వీటిని ఒడ్డుతో అనుసంధానం చేసే సిమెంట్ జెట్టీ నిర్మాణం 672 మీటర్లు ఇప్పటికే పూర్తయింది. మిగిలింది పది రోజుల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఇది పూర్తయితే బోట్లు ఇక్కడికి వచ్చి ఆపుకోవచ్చు. చేపల వేటను ప్రారంభించవచ్చు.
► ఇక కేవలం ఉపరితలం మీద నిర్మించే అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే చాలా భవనాలు శ్లాబు దశ దాటాయి. మిగిలినవి శ్లాబు దశకు చేరుకున్నాయి.
ఇంతకాలం ఉపాధి కోసం
కుటుంబాలను వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి వస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. దశాబ్దాల మా కల ఇప్పుడు నిజమవుతోంది.
బుచ్చింగారి చిట్టిబాబు, మత్స్యకారుడు, ఆదినారాయణపురం, నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment