Andhra Pradesh: హార్బర్లు చకచకా  | Construction of fastest fishing harbors in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: హార్బర్లు చకచకా 

Published Sun, Dec 12 2021 2:26 AM | Last Updated on Sun, Dec 12 2021 5:02 PM

Construction of fastest fishing harbors in Andhra Pradesh - Sakshi

కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద జోరుగా జరుగుతున్న ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. వర్షాలు, తుపాన్లు తగ్గడంతో పనులు ఊపందుకున్నాయి. దేశ చరిత్రలో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం రూ.3,622.86 కోట్ల పెట్టుబడి అంచనాతో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మారుస్తుందని, ముఖ్యంగా మత్స్యకారుల జీవన ప్రమాణాల్లో పెనుమార్పులు తెస్తుందని ఆర్థికవేత్తలు, మత్స్యకారులు విశ్వసిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

రూ.1,509.8 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,204.56 కోట్ల విలువైన పనుల కోసం పిలిచిన టెండర్లను ఎంఆర్‌కేఆర్‌ కనస్ట్రక్షన్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ గతేడాది డిసెంబర్‌లో చేజిక్కించుకుంది. ఏపీ మారిటైమ్‌ బోర్డుతో ఈ ఏడాది మార్చి 18న ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఈ హార్బర్ల నిర్మాణానికి అన్ని అనుమతులు రావడంతో ఈ ఏడాది జూన్‌ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించింది. హార్బర్‌ నిర్మాణంలో కీలకమైన భారీ మర పడవలు తిరిగే విధంగా సముద్రం లోతును తవ్వే డ్రెడ్జింగ్‌ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తిరిగి వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు అధికారులు పేర్కొన్నారు. 2023 ప్రారంభం నాటికి ఈ నాలుగు హార్బర్లను అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద జరుగుతున్న డ్రెడ్జింగ్‌ పనులు   

వారంలో మరో 5 హార్బర్లకు టెండర్లు
► రెండో దశ కింద రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా బుడగట్ల పాలెం, విశాఖపట్నం పూడిమడక, ప్రకాశం జిల్లా వోడరేవు, కొత్తపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పల్లో రూ.2,113.06 కోట్ల పెట్టుబడి వ్యయంతో హార్బర్ల నిర్మాణానికి తాజాగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
► ఈ ఐదు హార్బర్ల నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లను జ్యూడిషియల్‌ ప్రివ్యూకు పంపి, వచ్చే ఏడాది ప్రారంభంలో పనులు మొదలు పెట్టనున్నట్లు మారిటైమ్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఐదు హార్బర్లు రెండేళ్లలో అందుబాటులోకి రానున్నాయి. 
► మొత్తంగా తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా మూడు లక్షల టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్ల ద్వారా 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు దీనికి అనేక రెట్లు పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ హార్బర్ల ద్వారా మరో 10,000 మెకనైజ్డ్‌ బోట్లు నిలుపుకునే సామర్థ్యం లభిస్తుంది. 

సాకారమవుతున్న మరో హామీ 
► హార్బర్ల నిర్మాణం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ సాకారమవుతోంది. 
► రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ చేపల వేటకు సరైన వసతులు లేక అనేక మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోసం పశ్చిమ తీరానికి వలసపోతూ.. అక్కడ పొరపాటుగా పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశించి బందీలుగా మగ్గుతున్న వైనాన్ని పాదయాత్ర సందర్భంగా మత్స్యకారులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. మరికొంత మంది రోజువారీ కూలీలుగా వలసపోతున్నారు. 
► మత్స్యకారుల కష్టాలను గమనించిన జగన్‌.. ముఖ్యమంత్రి కాగానే వలసలకు అవకాశం లేకుండా స్థానికంగానే ఉపాధి లభించే విధంగా ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు రికార్డు స్థాయిలో తొమ్మిది హార్బర్ల నిర్మాణం చేపట్టడంపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తీరంపై ఈ స్థాయి పెట్టుబడులు ఇదే తొలిసారి
తీరప్రాంత అభివృద్ధి కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల కోసం మూడేళ్లలో సుమారు రూ.25,000 కోట్లు వ్యయం చేయనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల పనులు మొదలయ్యాయి. మరో ఐదు హార్బర్ల నిర్మాణం కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. ఏపీ మారిటైమ్‌ బోర్డు నిర్మిస్తున్న తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, మూడు పోర్టులు అందుబాటులోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది.
– మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్‌ బోర్డు

ఇదో పెద్ద సంస్కరణ నిర్ణయం
రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చే పెద్ద సంస్కరణ నిర్ణయమిది. దేశ వ్యాప్తంగా అత్యంత దీనమైన జీవన ప్రమాణాలు కలిగిన వారిలో మత్స్యకారులు ఒకరు. ఈ హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకార మహిళలకు అందించే నిజమైన చేయూతగా చెప్పవచ్చు.
– ప్రసాదరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఎకనామిక్స్‌ ఆచార్యులు

ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం
ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకార సమ్మేళనంలో మాకు మాట ఇచ్చిన ప్రకారంగా అధికారంలోకి వచ్చిన వెంటనే హార్బర్ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. మేము ఇక్కడ మినీ హార్బర్‌ అడిగితే ఏకంగా మేజర్‌ హార్బర్‌ నిర్మాణం చేపట్టారు. హార్బర్ల నిర్మాణం వల్ల  లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి.
– కారే శ్రీనివాసరావు, మత్స్యకార నాయకుడు, కొనపాపపేట, తూర్పుగోదావరి జిల్లా

వలస వెళ్లక్కర్లేదు
మా వద్ద ఉన్న సముద్ర జలాల్లో చేపలు సరిగా దొరకడం లేదు. కుటుంబ పోషణ కోసం కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఉన్న షిషింగ్‌ హార్బర్లకు వెళ్లి బోట్లలో కూలీలుగా పని చేస్తున్నాం. కుటుంబానికి దూరంగా ఉంటున్నాం. జువ్వలదిన్నె షిషింగ్‌ హార్బర్‌ కడితే ఇక్కడే బోట్లు అందుబాటులో ఉంటాయి. ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన అవసరం ఉండదు.
– కొమారి రాజు, మత్స్యకారుడు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా

ఇక అన్నీ మంచి రోజులే
ప్రస్తుతం ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌లో ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. మా సమస్యను గత టీడీపీ ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మత్స్యకారుల పట్ల ప్రేమతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి చేస్తే బోట్ల రాకపోకలకు ఇబ్బందులుండవు. మత్స్యకారులకు ఇక అన్నీ మంచి రోజులు రాబోతున్నాయి.
– లంకే వెంకటేశ్వరరావు, మెకనైజ్జ్‌ బోట్స్‌ కృష్ణా జిల్లా అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement