Fishing harbor construction
-
మత్స్యకారులకు కష్టాలుండవిక
సాక్షి, అమరావతి: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల కష్టాలను తీర్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ.3,500 కోట్లతో మినీ ఓడరేవులను తలపించేలా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మత్స్యకారులు వారి బోట్లను సురక్షితంగా నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకునేలా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర మత్స్య శాఖ ఏపీ మారిటైమ్ బోర్డుకు బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోని మత్స్యకారులు తమ పడవలను బీచ్‌ల్లోనే నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాన్లువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పడవలు, వలలు కొట్టుకుపోయి పేద మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పడవలను నిలుపుకొనేందుకు ఒక జెట్టీ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి చేపలను సురక్షితంగా మార్కెట్‌కు తరలించుకునేలా వీటిలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్లలో భారీ మెకనైజ్డ్ బోట్ల కోసం బ్రేక్ వాటర్ వంటివి ఉండాలని, కానీ ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లలో స్థానిక మత్స్యకారులు చిన్న నాటు పడవలు, మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఏపీ కోస్టల్‌జోన్ మేనేజ్మెంట్ అథారిటీల నుంచి అనుమతులు పొందడానికి కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఆరు ప్రాంతాల్లో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు, సముద్రపు ఒడ్డున ఎన్ని పడవలు నిలుపుతున్నారన్న అంశాలపై అధ్యయనం చేశామని, దీనికి అనుగుణంగా ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ఆరు చోట్ల 1,732 బోట్లు నిలుపుతున్నారని, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో బోట్లను నిలిపేలా వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వీరంతా అనధికారికంగా చేపల వేట చేపడుతుండటంతో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటయితే ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. -
వేగంగా 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా రూ.3,622.86 కోట్ల వ్యయంతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడల్లో ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ వీటిని నిర్మిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పూర్తయిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లను వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్లలో డ్రెడ్జింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. దీంతో కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అదనంగా మూడులక్షల టన్నుల మత్స్యసంపద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్లు అండుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకొనే సామర్థ్యం లభిస్తుంది. రెండోదశలో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లాలో పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, ఓడరేవుల్లో హార్బర్ల నిర్మాణాలకు రూ.1,496.85 కోట్ల విలువైన పనులకు ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. -
Andhra Pradesh: హార్బర్లు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. వర్షాలు, తుపాన్లు తగ్గడంతో పనులు ఊపందుకున్నాయి. దేశ చరిత్రలో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం రూ.3,622.86 కోట్ల పెట్టుబడి అంచనాతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మారుస్తుందని, ముఖ్యంగా మత్స్యకారుల జీవన ప్రమాణాల్లో పెనుమార్పులు తెస్తుందని ఆర్థికవేత్తలు, మత్స్యకారులు విశ్వసిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.1,509.8 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,204.56 కోట్ల విలువైన పనుల కోసం పిలిచిన టెండర్లను ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ గతేడాది డిసెంబర్లో చేజిక్కించుకుంది. ఏపీ మారిటైమ్ బోర్డుతో ఈ ఏడాది మార్చి 18న ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఈ హార్బర్ల నిర్మాణానికి అన్ని అనుమతులు రావడంతో ఈ ఏడాది జూన్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించింది. హార్బర్ నిర్మాణంలో కీలకమైన భారీ మర పడవలు తిరిగే విధంగా సముద్రం లోతును తవ్వే డ్రెడ్జింగ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తిరిగి వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. 2023 ప్రారంభం నాటికి ఈ నాలుగు హార్బర్లను అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు వారంలో మరో 5 హార్బర్లకు టెండర్లు ► రెండో దశ కింద రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా బుడగట్ల పాలెం, విశాఖపట్నం పూడిమడక, ప్రకాశం జిల్లా వోడరేవు, కొత్తపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పల్లో రూ.2,113.06 కోట్ల పెట్టుబడి వ్యయంతో హార్బర్ల నిర్మాణానికి తాజాగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ► ఈ ఐదు హార్బర్ల నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లను జ్యూడిషియల్ ప్రివ్యూకు పంపి, వచ్చే ఏడాది ప్రారంభంలో పనులు మొదలు పెట్టనున్నట్లు మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఐదు హార్బర్లు రెండేళ్లలో అందుబాటులోకి రానున్నాయి. ► మొత్తంగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా మూడు లక్షల టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్ల ద్వారా 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు దీనికి అనేక రెట్లు పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ హార్బర్ల ద్వారా మరో 10,000 మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే సామర్థ్యం లభిస్తుంది. సాకారమవుతున్న మరో హామీ ► హార్బర్ల నిర్మాణం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ సాకారమవుతోంది. ► రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ చేపల వేటకు సరైన వసతులు లేక అనేక మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోసం పశ్చిమ తీరానికి వలసపోతూ.. అక్కడ పొరపాటుగా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి బందీలుగా మగ్గుతున్న వైనాన్ని పాదయాత్ర సందర్భంగా మత్స్యకారులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మరికొంత మంది రోజువారీ కూలీలుగా వలసపోతున్నారు. ► మత్స్యకారుల కష్టాలను గమనించిన జగన్.. ముఖ్యమంత్రి కాగానే వలసలకు అవకాశం లేకుండా స్థానికంగానే ఉపాధి లభించే విధంగా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు రికార్డు స్థాయిలో తొమ్మిది హార్బర్ల నిర్మాణం చేపట్టడంపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తీరంపై ఈ స్థాయి పెట్టుబడులు ఇదే తొలిసారి తీరప్రాంత అభివృద్ధి కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల కోసం మూడేళ్లలో సుమారు రూ.25,000 కోట్లు వ్యయం చేయనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయి. మరో ఐదు హార్బర్ల నిర్మాణం కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మిస్తున్న తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, మూడు పోర్టులు అందుబాటులోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు ఇదో పెద్ద సంస్కరణ నిర్ణయం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చే పెద్ద సంస్కరణ నిర్ణయమిది. దేశ వ్యాప్తంగా అత్యంత దీనమైన జీవన ప్రమాణాలు కలిగిన వారిలో మత్స్యకారులు ఒకరు. ఈ హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకార మహిళలకు అందించే నిజమైన చేయూతగా చెప్పవచ్చు. – ప్రసాదరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఎకనామిక్స్ ఆచార్యులు ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకార సమ్మేళనంలో మాకు మాట ఇచ్చిన ప్రకారంగా అధికారంలోకి వచ్చిన వెంటనే హార్బర్ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. మేము ఇక్కడ మినీ హార్బర్ అడిగితే ఏకంగా మేజర్ హార్బర్ నిర్మాణం చేపట్టారు. హార్బర్ల నిర్మాణం వల్ల లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి. – కారే శ్రీనివాసరావు, మత్స్యకార నాయకుడు, కొనపాపపేట, తూర్పుగోదావరి జిల్లా వలస వెళ్లక్కర్లేదు మా వద్ద ఉన్న సముద్ర జలాల్లో చేపలు సరిగా దొరకడం లేదు. కుటుంబ పోషణ కోసం కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న షిషింగ్ హార్బర్లకు వెళ్లి బోట్లలో కూలీలుగా పని చేస్తున్నాం. కుటుంబానికి దూరంగా ఉంటున్నాం. జువ్వలదిన్నె షిషింగ్ హార్బర్ కడితే ఇక్కడే బోట్లు అందుబాటులో ఉంటాయి. ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన అవసరం ఉండదు. – కొమారి రాజు, మత్స్యకారుడు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా ఇక అన్నీ మంచి రోజులే ప్రస్తుతం ఉన్న ఫిషింగ్ హార్బర్లో ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. మా సమస్యను గత టీడీపీ ప్రభుత్వంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారుల పట్ల ప్రేమతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేస్తే బోట్ల రాకపోకలకు ఇబ్బందులుండవు. మత్స్యకారులకు ఇక అన్నీ మంచి రోజులు రాబోతున్నాయి. – లంకే వెంకటేశ్వరరావు, మెకనైజ్జ్ బోట్స్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు -
ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్లపై హైలెవల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీడీఆర్పీ పనులన్నీ పూర్తి చేయాలి ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రూ.1,773 కోట్ల అంచనాలతో శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఏపీడీఆర్పీ ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీడీఆర్పీ) 4వ రాష్ట్రస్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశం సీఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. వాస్తవానికి ఈ పనులన్నీ 2015–2020 మధ్య పూర్తి చేయాల్సి ఉందని, అయితే కరోనా తదితర కారణాల వల్ల సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది వరకు గడువును పొడిగించిందని వివరించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో భావనపాడు పోర్టు టెండర్లు
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 4 ఫిషింగ్ హార్బర్లు, రెండు పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో పోర్టు, నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రంగం సిద్ధంచేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద సుమారు రూ.3,670 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారైందని, ఆర్థికశాఖ నుంచి అనుమతి రాగానే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ కే మురళీధరన్ తెలిపారు. అదే విధంగా మరో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఆర్థిక శాఖ ఆమోదానికి పంపామని, అవి రాగానే పోర్టు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు ఆగస్టులో టెండర్లు పిలవనున్నామన్నారు. ఇప్పటికే సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో జువ్వలదిన్నె(నెల్లూరు), ఉప్పాడ (తూర్పు గోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు బుడగట్లపాలెం (శ్రీకాకుళం జిల్లా), పూడిమడక (విశాఖ), కొత్తపట్నం (ప్రకాశం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం ఓడరేవు పనులను సెప్టెంబర్ నుంచి శ్రీకారం చుట్టేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఈలోగా పోర్టుకు సంబంధించి అన్ని అనుమతులు సాధించడంపై దృష్టి పెట్టింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతుల కోసం ఈ నెల 28న రామాయపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్, అరబిందో రియాల్టీ కలిసి దక్కించుకున్న సంగతి తెలిసిందే. పోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను ఏపీ మారిటైమ్ బోర్డు రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. సెప్టెంబర్‌లో పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు మురళీధరన్ తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు టెండర్లు ఖరారయ్యేలోగా పర్యావరణ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
మత్స్య సంపద పెంచేందుకే వీటి ఏర్పాటు: మంత్రి
సాక్షి, నెల్లూరు: కేంద్రం సహకారంతో జువ్వలదిన్నె వద్ద రూ. 280 కోట్లతో ఫిషింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మీడయాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందిస్తామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెంచి మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి) తీరంలోని 9 జిల్లాల్లో మత్స్య సంసపదను పెంచేందుకే ఈ సెంటర్లను ఏర్పాటు అని ఆయన తెలిపారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. త్వరలో రామాయపట్నం పోర్టు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. మత్స్య, ఆక్వా రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఫిషింగ్ హర్భర్‌కు అనుబంధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. -
ఫిషింగ్ హార్బర్‌పై.. నయాడ్రామా
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు విషయంలో నాలుగేళ్లపాటు మత్స్యకారులను ఊరిస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ సరికొత్త నాటకానికి తెరతీసింది. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) పంపితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సగం నిధులు మంజూరు చేస్తామన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో హడావుడిగా కేంద్రానికి నివేదికను పంపారు. అయితే దీనిని కేంద్రం తిరస్కరించింది. ‘‘మేము ఎప్పుడు పంపమన్నాం.. మీరు ఎప్పుడు పంపారు.. ఇప్పుడిస్తే నిధులు ఇవ్వం’’ అంటూ డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపేసింది. జరిగిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారపార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. మత్స్యకారులను మరోసారి మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే విడతల వారీగా హార్బర్‌ను నిర్మిస్తుందన్న కొత్త డ్రామా మొదలెట్టింది. రూ.50 కోట్లతో పనులు ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా అధికారుల నుంచి తెప్పించుకుంది. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. కావలి (నెల్లూరు): సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్‌ను ప్రభుత్వం ప్రైవేట్ పోర్టు నిర్మాణం కోసం తొలగించింది. వేరే ప్రాంతంలో హార్బర్ నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి స్థల అన్వేషణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు గడిపేసింది. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామం వద్ద íఫిషింగ్ హార్బర్ నిర్మించాలని, ఏడాదిన్నర క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.244 కోట్లతో తొలి దశలో నిర్మించాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్‌కు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.122 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. నిర్మాణ పనులు ప్రారంభిస్తే మూడేళ్లకు కానీ పూర్తి కాదు. అయితే అధికార టీడీపీ నేతలు ఈ పనులను ఎన్నికల వాతావరణంలో ప్రారంభించేలా చేయడానికి కాలయాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని మత్స్యకారులు అవస్థలు పడుతూ నష్టపోతున్నారు. తరలుతున్న మత్స్యసంపద 169 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న జిల్లాలోని 12 మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులే 1.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో లక్ష మంది చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే ప్రత్యక్షంగా లక్ష మంది మత్స్యకారులకు, పరోక్షంగా మరో లక్ష మందికి జీవనోపాధి దొరికే అవకాశం ఉంది. జిల్లాలో మెకనైజ్డ్ బోట్లు అధికారికంగా, అనధికారికంగా కలిపి 7,000 ఉన్నాయి. అలాగే కొయ్య తెప్పలు 4,000, పెద్ద బోట్లు 20 ఉన్నాయి. ఒక్కో దాంట్లో కనీసం ముగ్గురు నుంచి 10 మంది వరకు చేపల వేట చేస్తారు. వీరు ఒడ్డుకు తెచ్చే మత్స్యసంపద ఏడాదికి 75 వేల టన్నులు ఉంటుంది. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే జిల్లాలోని మార్కెట్లకు తరలుతోంది. మిగిలిన మత్స్యసంపద అంతా కూడా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు తరలిపోతోంది. అయితే ఫిషింగ్ హార్బర్ లేకపోవడంతో మత్స్య సంపదను తీరంలో దించుకోవడానికి అనువైన ప్రదేశాలు లేవు. అలాగే మంచి ధరలకు అమ్మకాలు చేయడానికి వ్యాపారులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పడవలు, బోట్లలను ప్రకాశం జిల్లాలోని వాడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సివస్తోంది. దీని వల్ల సమయం, డీజిల్ ఖర్చు పెరగడం, సొంత ఊర్లకు రావాలంటే బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు తప్పడం లేదు. దీనివల్ల మత్స్యకారులు దళారుల చేతిలో అన్ని రకాలుగా నష్టపోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ దమననీతి జిల్లాలోని మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కోరుతుండడం, కేంద్ర ప్రభుత్వం తన ‘సాగరమాల’ పథకంలో భాగంగా జిల్లాలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులు మంజూరుకు పచ్చ జెండా ఊపింది. అయితే సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ‘వాప్కోస్ లిమిటెడ్’ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నివేదికను తయారు చేయించింది. ఆ నివేదికను అధికారికంగా తీసుకున్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదని జిల్లాలోని మత్స్యకారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిఉంటుందని అధికార టీడీపీ నాయకులు భావించారు. అందుకే ఏడాదిన్నర క్రితం ‘వాప్కోస్ లిమిటెడ్’ జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సమగ్ర అధ్యయనంతో కూడిన నివేదికను సిద్ధం చేసినప్పటికీ దానిని గోప్యంగా ఉంచి గత సెప్టెంబర్ నెలలో నివేదిక అందినట్లుగా వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో సమర్పించి నిధులు మంజూరు చేయమని కోరలేదు. నివేదికను సమర్పించగానే కేంద్ర తన వాటా నిధులను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాల్సి వస్తుందని నివేదికను న్యూఢిల్లీకి పంపలేదు. వచ్చే ఏడాది జనవరి నెల తర్వాత నిధులు మంజూరయ్యేటట్లుగా చేసి, టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికార టీడీపీ నాయకులు తలపోస్తున్నారు. అంటే ఎన్నికలు దగ్గర పడే వేళ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నట్లుగా జిల్లాలోని మత్స్యకారులను మభ్యపెట్టి ఓట్లు పొందాలనే దమననీతిని అవలంభించారు. అది బెడిసికొట్టింది. అధికార టీడీపీ నాయకుల కుయుక్తుల వల్ల జిల్లాలో మత్స్యకారుల ఆర్థిక ఉన్నతికి దోహదపడే ఫిషింగ్ హార్బర్ అటకెక్కింది. -
ఆశల పల్లకిలో...
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ‘పశ్చిమ’ ప్రజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు రేకెత్తించారు. రాష్ట్ర రాజధాని ప్రకటనలో భాగంగా గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ నరసాపురం తీరప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, కొల్లేరులో పర్యాటక అభివృద్ధి, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం పునరుద్ధరణ, పేరుపాలెం బీచ్ అభివృద్ధి, వివిధ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలన్నీ ఎంతవరకు సాకారమవుతాయో వేచి చూడాల్సిందే. గూడెం నుంచి గగన విహారానికి గ్రీన్ సిగ్నల్ తాడేపల్లిగూడెం : జిల్లా వాసుల గగన విహారం కల త్వరలోనే సాకారం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీలో ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని ప్రకటించారు. జిల్లాలో తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. చంద్రబాబు హామీ నెరవేరితే త్వరలోనే జిల్లా వాసులు గగన విహారం చేసేందుకు అవకాశం కలుగుతుంది. విమానంలో ఎగిరే చాన్స్ లభిస్తుంది. స్థానిక ఎయిర్‌స్ట్రిప్‌ను విమానాశ్రయంగా మార్చనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలిస్తామని స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. విమానాశ్రయ భూములను పట్టాలిచ్చేందుకు సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని, ఫైల్ ఆయన వద్ద ఉందని కొంతకాలం క్రితం మంత్రి ప్రకటించారు. ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తారా, పేదల ఇళ్లకు పట్టాలిస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మాణం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అత్యవసర కార్యకలాపాల కోసం గూడెంలో బ్రిటిష్ వారు ఎయిర్‌స్ట్రిప్ నిర్మించారు. అప్పట్లో 650 ఎకరాలు భూమిని సేకరించారు. యుద్ధం ముగిశాక ఈ ప్రాంతం మొత్తం రక్షణ శాఖ ఆధీనంలో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు కోటి రూపాయలు చెల్లించడంతో ఈ భూములు ప్రభుత్వానికి బదలాయించారు. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉన్నాయి. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గూడెంలో విమానాశ్రయం అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సర్వే నిర్వహించి టెండర్లు పిలవగా సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థ మైటాస్ కంపెనీకి ఖరారయ్యింది. అనంతరం సత్యంలో తలెత్తిన సంక్షోభం, వైఎస్ అకాలమరణంతో విమానాశ్రయం ఏర్పాటు అటకెక్కింది. 1.90 కిలోమీటర్ల రన్‌వే విమానాశ్రయానికి గూడెం ప్రాంతం చాలా అనుకూలం. ఇప్పటికే విండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను హైదరాబాద్‌లోని విమానయాన వాతావరణ కేంద్రం ఇచ్చింది. ఇక్కడ రన్‌వే 1.90 కిలోమీటర్ల పొడవు ఉంది. విమానాలు దిగడానికి కిలోమీటరున్నర పొడవైన రన్‌వే ఉంటే చాలు. దానికంటే 40 మీటర్లు పొడవైన చెక్కు చెదరని రన్‌వే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ భూమి 280 ఎకరాలు అందుబాటులో ఉంది. ఇంకాస్త భూమి సేకరిస్తే చాలు. ఏలూరు వాసులు ట్రాఫిక్ వలయాన్ని దాటుకొని గన్నవరం విమానాశ్రయం వెళ్లే కంటే నలభై నిమిషాల్లో గూడెం చేరుకోవచ్చు. జిల్లాకు గూడెం బౌగోళికంగా మధ్యలో ఉండడం అనుకూలం. జిల్లా వాసులతో పాటు రావులపాలెం ప్రాంత ప్రజలు కూడా హైవే ద్వారా త్వరగా చేరుకోవచ్చు. కార్గో సౌకర్యం కూడా ఏర్పడితే ఉల్లిపాయలు, రొయ్యలు, చేపలు, బియ్యం వంటి వాటిని ఇతర ప్రాంతాలకు త్వరగా చేర్చవచ్చు. మారనున్న‘గూడెం’ ముఖచిత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నెరవేరితే తాడేపల్లిగూడెం ముఖచిత్రం మారనుంది. జలరవాణా పునరుద్ధరణ, మరో పక్క విమానాశ్రయం ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యాన పరిశోధనాస్థానాల రాకతో పట్టణానికి మహర్దశ పట్టే అవకాశం ఉంది. బకింగ్ హామ్ కెనాల్ రవాణా సాగే సమయంలో గూడెం పట్టణం ప్రముఖ జలరవాణా కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. మళ్లీ జల రవాణా ప్రారంభమైతే మరింత అభివృద్ధి సాధించనుంది. దీనికితోడు గూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వెంకట్రామన్నగూడెంలో ఉన్న కేంద్ర అటవీపర్యావరణ భూముల్లో ఏర్పాటు కావచ్చని అంచనా. మరోవైపు ఉద్యానవర్సిటీ వద్ద పుష్ప పరిశోధనా స్థానం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏర్పాటు కావాలంటే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గట్టిగా లాబీయింగ్ చేయాల్సి ఉంది. తీరంపై కనికరం నరసాపురం (రాయపేట) : జిల్లాలోని తీరప్రాంతంపై ప్రభుత్వం ఎట్టకేలకు కనికరం చూపించింది. నరసాపురం తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్రకటన తీరప్రాంత వాసుల్లో కొత్త ఆశలను చిగురింపచేశాయి. నరసాపురం తీరప్రాంతం దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కాకినాడ, విశాఖపట్టణం, నెల్లూరు తీరప్రాంతాల అభివృద్ధికే పాలకులు ఇప్పటి వరకు మొగ్గుచూపారు. దీంతో మన జిల్లాలోని తీరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్ నిర్మాణం, మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు లేసు పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చేతివృత్తుల కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎంతమేరకు సాకారమవుతాయో వేచి చూడాల్సి ఉంది. 19 కిలోమీటర్ల తీర ప్రాంతం నరసాపురం తీరప్రాంతం సుమారు 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దశాబ్దకాలంగా తీరప్రాంత వాసులను ఊరిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం నేటికీ నోచుకోలేదు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా నరసాపురం మండలం బియ్యపుతిప్పవద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే తీరప్రాంత గ్రామాలైన బియ్యపుతిప్ప, వేములదీవి తూర్పు, వేములదీవి పడమర, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు తదితర గ్రామాల రూపురేఖలు మారినట్టే. పర్యాటక కేంద్రంగా పేరుపాలెం బీచ్ మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు పేరుపాలెం బీచ్‌లో పర్యటిస్తుంటారు. పర్యాటకులకు అనుగుణంగా ఇక్కడ రీసార్ట్స్ ఏర్పాటు చేస్తే టూరిజం ప్రాంతంగా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లేసు అల్లికల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కేంద్రం బడ్జెట్లో లేసు పరిశ్రమను మెగా క్లష్టర్‌గా అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లకు పైగా ప్రత్యేక నిధులు వెచ్చించిన విషయం విధితమే. ఈ పరిశ్రమకు మరింత చేయూతనిచ్చి దీనిపై ఆధారపడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చించి చేతి వృత్తులకు సంబంధించి ప్రత్యేక కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ‘స్మార్ట్’ కాదట ఏలూరు సెంట్రల్ : ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీల్లో ఒకదానిగా చేరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ మాగంటి బాబు హామీలు నెరవేరలేదు. ముఖ్యమంత్రి గురువారం ప్రకటించిన స్మార్ట్ సిటీలో జాబితాలో ఏలూరుకు స్థానం దక్కలేదు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థ మొదటి సమావేశంలో టీడీపీకి చెందిన కార్పొరేటర్ నాయుడు పోతురాజు ఏలూరును స్మార్ట్ సిటీగా ఎంపిక చేసే విషయాన్ని కౌన్సిల్లో లేవనెత్తారు. దీనిపై ఎంపీ బాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా ఏలూరును స్మార్ట్ సిటీ చేస్తామన్న చంద్రబాబు దాన్ని పూర్తిగా విస్మరించారు. ఏలూరుకు ఏ ఒక్క వరాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర నూతన రాజధానిగా ప్రకటించిన విజయవాడకు సమీపంలో ఉన్న ఏలూరును అభివృద్ధి చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నగర ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. దీనిపై ఎంపీ బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. నగరంపై చిన్నచూపు తగదు ఏలూరుపై చిన్న చూపు తగదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదు. స్వయంగా ఆయనే స్మార్ట్ సిటీ చేస్తామని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు మొండిచెయ్యి చూపారు. అసెంబ్లీ వేదికగా బాబు చేసిన ప్రకటనతో ఆయనవన్నీ బడాయి మాటలన్న సంగతి ఏలూరు ప్రజలందరికీ తెలిసింది. - గుడిదేశి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వరం దక్కని భీమవరం భీమవరం : ఆక్వా కేంద్రంగా, జిల్లా ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న భీమవరానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. గురువారం శాసనసభలో రాజధానితో పాటు వివిధ ప్రాజెక్టులను ప్రకటించిన చంద్రబాబు భీమవరానికి ఒక్క వరం కూడా ప్రకటించకపోవడంపై పట్టణ వాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం కోట్ల రూపాయల ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతున్న భీమవరం ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం ప్రాంతానికి నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, యూనివర్సిటీ, ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులాంటివి ఏదో ఒకటి వస్తుందని ప్రజలు ఆశిస్తూ వచ్చారు. సీఎం తీరుపై తెలుగు తమ్ముళ్లు సైతం పెదవి విరుస్తున్నారు.