సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా రూ.3,622.86 కోట్ల వ్యయంతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడల్లో ఎంఆర్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ వీటిని నిర్మిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
పూర్తయిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లను వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్లలో డ్రెడ్జింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. దీంతో కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అదనంగా మూడులక్షల టన్నుల మత్స్యసంపద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ హార్బర్లు అండుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకొనే సామర్థ్యం లభిస్తుంది. రెండోదశలో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లాలో పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, ఓడరేవుల్లో హార్బర్ల నిర్మాణాలకు రూ.1,496.85 కోట్ల విలువైన పనులకు ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే.
వేగంగా 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
Published Tue, Mar 1 2022 5:59 AM | Last Updated on Tue, Mar 1 2022 11:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment