సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం బందరు (మచిలీపట్నం) పోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. బందరు పోర్టు తొలిదశలో రూ.5,835 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీన్లో రూ.1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలినది ఏపీ మారిటైమ్ బోర్డు రుణ రూపంలో సమకూరుస్తుంది.
వాణిజ్యపరంగా పోర్టు పూర్తయితే చుట్టుపక్కల పోర్టు ఆధారిత పరిశ్రమలు రావడంతో పాటు 80 వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బందరు పోర్టును సొంతంగా అభివృద్ధి చేసి లీజుకు (ల్యాండ్ లార్డ్) ఇచ్చే విధానం అమలు చేస్తోంది. దీన్లో భాగంగా ఇప్పుడు రూ.3,650.07 కోట్లతో పనులు చేపట్టడానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలుస్తోంది. ఈపీసీ విధానంలో పనులు చేపట్టడానికి టెండర్లను న్యాయ పరిశీలనకోసం బుధవారం జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపింది. ఈ టెండర్లపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఏడు రోజుల్లోగా తెలపాలని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో కె.మురళీధరన్ ఒక ప్రకటనలో కోరారు.
తొలిదశలో ఇలా...
తొలిదశలో వివిధ రకాల సరుకు రవాణాకు వినియోగించే విధంగా మొత్తం నాలుగు బెర్తులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఒకటి మల్టీ పర్పస్ బెర్త్‌కాగా, రెండు జనరల్ కార్గో బెర్తులు, ఒకటి బోగ్గు కోసం కేటాయిస్తారు. అలాగే 2.99 కిలోమీటర్ల బ్రేక్ వాటర్, 43.82 మిలియన్ మీటర్ల డ్రెడ్జింగ్‌తో పాటు, అంతర్గత, బహిర్గత మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ఈ పనులకు రూ.3,650.07 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ పనుల వ్యయాన్ని 2020–21 ఎస్‌వోఆర్ ప్రకారం లెక్కించారు. తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తిచేయాలని నిర్దేశించారు. ఈ టెండర్లను ఏపీ పోర్టు డాట్ జీవోవీ డాట్ ఇన్ లేదా జ్యుడిషియల్ ప్రివ్యూ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్‌ల ద్వారా పరిశీలించవచ్చు.
రూ.3,650 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం
Published Thu, Apr 1 2021 3:25 AM | Last Updated on Thu, Apr 1 2021 4:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment