Krishna District: AP CM YS Jagan Will Inaugurate The Machilipatnam Port Construction Works Today - Sakshi
Sakshi News home page

బందరు పోర్టు పనులకు నేడే శుభారంభం

Published Mon, May 22 2023 4:40 AM | Last Updated on Mon, May 22 2023 8:48 AM

CM YS Jagan Bhumi Puja For Bandar Port Works - Sakshi

పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్న ప్రాంతం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రారంభించ­నున్నారు. భూసేకరణ పూర్తిచేసి, అన్ని అను­మతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఖరారుచేసి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి­చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పనులు ఆగకుండా శరవేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణా­ళికను సిద్ధంచేసింది. పూర్తిగా ప్రభుత్వ వ్య­యంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో కృష్ణాజిల్లా ముఖచిత్రం మారనుంది. 

75 ఏళ్లలో ఆరు, ఈ నాలుగేళ్లలో నాలుగు..
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం ఆరు పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నవశకా­నికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్లలోపే మరో నాలుగు పోర్టుల నిర్మా­ణానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇప్ప­టికే రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టుల్లో పనులు శరవేగంగా జరుగుతుండగా, మూలపేట పోర్టు పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇక సోమవారం నుంచి ఈ జాబితాలో మచిలీపట్నం పోర్టు కూడా చేరనుంది. 

25వేల మంది ఉపాధి..
35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.

ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది.
 
తొలి ఏడాదే కార్పొరేషన్, పరిపాలనా అనుమతులు..
తూర్పు తీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్‌ వారికి సైతం వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు విలసిల్లింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్‌ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత మే 22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు.

మారనున్న సముద్ర తీర ప్రాంత ముఖచిత్రం
ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్‌ పోర్టు, ఐదు నాన్‌ మేజర్‌ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే..

► కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

► పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్‌ భూములను ప్రభుత్వం గుర్తించింది. 

► తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది.

► ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 

► వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

► ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు.

హడావుడిగా బాబు శంకుస్థాపన
నిజానికి.. అధికారంలో ఉన్న కాలంలో పోర్టు నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టని చంద్రబాబు 2019 ఎన్నికలు దగ్గర పడిన సమయంలో బందరు పోర్టుకు ఎటువంటి అనుమతులు, నిధులు లేకుండా హడావుడిగా శంకుస్థాపన చేశారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు, ఫైనాన్షియల్‌ క్లోజర్, రోడ్డు కనెక్టివిటీ, భూసేకరణ చేయకుండానే మొక్కుబడిగా శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మాయచేశారు. 

మచిలీపట్నం పోర్టు విశేషాలు..
► భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు
► వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్‌ టన్నులు
► బెర్తుల సంఖ్య 4
► భూసేకరణ.. 1,923 ఎకరాలు
► ఎన్‌హెచ్‌ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి
► పెడన రైల్వేస్టేషన్‌ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం
► బందరు కెనాల్‌ నుండి 11 కి.మీ పైప్‌లైన్‌ ద్వారా 0.5 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి సరఫరా
► పెడన 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్‌ యాంప్‌) విద్యుత్‌ సరఫరా

నేడు మచిలీపట్నానికి సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి మచిలీపట్నం మండల పరిధిలోని తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్‌ మచిలీపట్నం నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement