చిప్పలేరులో లంగరు వేసిన పడవ
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు విషయంలో నాలుగేళ్లపాటు మత్స్యకారులను ఊరిస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ సరికొత్త నాటకానికి తెరతీసింది. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) పంపితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సగం నిధులు మంజూరు చేస్తామన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో హడావుడిగా కేంద్రానికి నివేదికను పంపారు. అయితే దీనిని కేంద్రం తిరస్కరించింది. ‘‘మేము ఎప్పుడు పంపమన్నాం.. మీరు ఎప్పుడు పంపారు.. ఇప్పుడిస్తే నిధులు ఇవ్వం’’ అంటూ డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపేసింది. జరిగిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారపార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. మత్స్యకారులను మరోసారి మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే విడతల వారీగా హార్బర్‌ను నిర్మిస్తుందన్న కొత్త డ్రామా మొదలెట్టింది. రూ.50 కోట్లతో పనులు ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా అధికారుల నుంచి తెప్పించుకుంది. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది.
కావలి (నెల్లూరు): సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్‌ను ప్రభుత్వం ప్రైవేట్ పోర్టు నిర్మాణం కోసం తొలగించింది. వేరే ప్రాంతంలో హార్బర్ నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి స్థల అన్వేషణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు గడిపేసింది. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామం వద్ద íఫిషింగ్ హార్బర్ నిర్మించాలని, ఏడాదిన్నర క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.244 కోట్లతో తొలి దశలో నిర్మించాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్‌కు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.122 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. నిర్మాణ పనులు ప్రారంభిస్తే మూడేళ్లకు కానీ పూర్తి కాదు. అయితే అధికార టీడీపీ నేతలు ఈ పనులను ఎన్నికల వాతావరణంలో ప్రారంభించేలా చేయడానికి కాలయాపన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని మత్స్యకారులు అవస్థలు పడుతూ నష్టపోతున్నారు.
తరలుతున్న మత్స్యసంపద
169 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న జిల్లాలోని 12 మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులే 1.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో లక్ష మంది చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే ప్రత్యక్షంగా లక్ష మంది మత్స్యకారులకు, పరోక్షంగా మరో లక్ష మందికి జీవనోపాధి దొరికే అవకాశం ఉంది. జిల్లాలో మెకనైజ్డ్ బోట్లు అధికారికంగా, అనధికారికంగా కలిపి 7,000 ఉన్నాయి. అలాగే కొయ్య తెప్పలు 4,000, పెద్ద బోట్లు 20 ఉన్నాయి. ఒక్కో దాంట్లో కనీసం ముగ్గురు నుంచి 10 మంది వరకు చేపల వేట చేస్తారు. వీరు ఒడ్డుకు తెచ్చే మత్స్యసంపద ఏడాదికి 75 వేల టన్నులు ఉంటుంది.
ఇందులో కేవలం 20 శాతం మాత్రమే జిల్లాలోని మార్కెట్‌లకు తరలుతోంది. మిగిలిన మత్స్యసంపద అంతా కూడా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు తరలిపోతోంది. అయితే ఫిషింగ్ హార్బర్ లేకపోవడంతో మత్స్య సంపదను తీరంలో దించుకోవడానికి అనువైన ప్రదేశాలు లేవు. అలాగే మంచి ధరలకు అమ్మకాలు చేయడానికి వ్యాపారులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పడవలు, బోట్లలను ప్రకాశం జిల్లాలోని వాడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సివస్తోంది. దీని వల్ల సమయం, డీజిల్ ఖర్చు పెరగడం, సొంత ఊర్లకు రావాలంటే బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు తప్పడం లేదు. దీనివల్ల మత్స్యకారులు దళారుల చేతిలో అన్ని రకాలుగా నష్టపోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వ దమననీతి
జిల్లాలోని మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కోరుతుండడం, కేంద్ర ప్రభుత్వం తన ‘సాగరమాల’ పథకంలో భాగంగా జిల్లాలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులు మంజూరుకు పచ్చ జెండా ఊపింది. అయితే సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ‘వాప్‌కోస్ లిమిటెడ్’ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నివేదికను తయారు చేయించింది. ఆ నివేదికను అధికారికంగా తీసుకున్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదని జిల్లాలోని మత్స్యకారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిఉంటుందని అధికార టీడీపీ నాయకులు భావించారు.
అందుకే ఏడాదిన్నర క్రితం ‘వాప్‌కోస్ లిమిటెడ్’ జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సమగ్ర అధ్యయనంతో కూడిన నివేదికను సిద్ధం చేసినప్పటికీ దానిని గోప్యంగా ఉంచి గత సెప్టెంబర్ నెలలో నివేదిక అందినట్లుగా వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో సమర్పించి నిధులు మంజూరు చేయమని కోరలేదు. నివేదికను సమర్పించగానే కేంద్ర తన వాటా నిధులను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాల్సి వస్తుందని నివేదికను న్యూఢిల్లీకి పంపలేదు.
వచ్చే ఏడాది జనవరి నెల తర్వాత నిధులు మంజూరయ్యేటట్లుగా చేసి, టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికార టీడీపీ నాయకులు తలపోస్తున్నారు. అంటే ఎన్నికలు దగ్గర పడే వేళ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నట్లుగా జిల్లాలోని మత్స్యకారులను మభ్యపెట్టి ఓట్లు పొందాలనే దమననీతిని అవలంభించారు. అది బెడిసికొట్టింది. అధికార టీడీపీ నాయకుల కుయుక్తుల వల్ల జిల్లాలో మత్స్యకారుల ఆర్థిక ఉన్నతికి దోహదపడే ఫిషింగ్ హార్బర్ అటకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment