నీళ్లో నారాయణా..! | Water Problem in Municipal Minister Narayana Constituency | Sakshi
Sakshi News home page

నీళ్లో నారాయణా..!

Published Sun, Aug 5 2018 7:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Water Problem in Municipal Minister Narayana Constituency - Sakshi

ఓ వైపు కార్పొరేషన్‌ అధికారులు నీళ్లు ఇవ్వరు.. మరోవైపు భూగర్భజలాలు అడుగంటి బోర్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆరు నెలలుగా నెల్లూరు ప్రజలు గుక్కెడు నీటికోసం కటకటలాడుతున్నారు..నిత్యం 105ఎంఎల్‌డీ నీటిని నెల్లూరు నగరవాసులకు అందించాల్సి ఉంది. అందులో సగం కూడా సరఫరా కావడం లేదు. నీళ్ల కోసం కార్పొరేషన్‌ అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. సాక్షాత్తూ మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ నివాసం ఉంటున్న నగరంలోనే నిధుల్లేవ్‌.. నీళ్లు ఇవ్వలేమంటున్నారు అధికారులు. ‘నీళ్లో నారాయణా’ అంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

నెల్లూరు సిటీ: నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు మున్సిపల్‌ పైప్‌లైన్‌ల ద్వారా వచ్చేనీరు నిలిచిపోవడం.. మరోవైపు భూమిలో నీళ్లు ఇంకిపోవడంతో ఆరు నెలలుగా ప్రజలు నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కార్పొరేషన్‌ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాల పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్‌లు రోడ్ల తవ్వకాలు జరిపిన సమయంలో మున్సిపల్‌ వాటర్‌ పైప్‌లు దెబ్బతింటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సరఫరా వారాల తరబడి నిలిచిపోతోంది. 

నెల్లూరు నగరంలోని 54 డివిజన్‌లు, 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. సుమారు 7 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు రోజూ 105ఎంఎల్‌డీ నీటిని అందించాల్సి ఉంది. అయితే కేవలం 85ఎంఎల్‌డీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 60ఎంఎల్‌డీ నీటిని కూడా సరఫరా కావడం లేదు. పెన్నానది, బుజ్జమ్మరేవు, సమ్మర్‌ స్టోరేజీట్యాంకు నుంచి కార్పొరేషన్‌ తాగునీటిని సరఫరా చేస్తోంది.

 రోజుకు 85ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. పెన్నానది నుంచి 49 ఎంఎల్‌డీ, బుజ్జమ్మరేవు నుంచి 6 ఎంఎల్‌డీ, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నుంచి 18 ఎంఎల్‌డీ, మిగిలిన నీటిని బోర్‌వెల్స్‌ నుంచి 12 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు, మూడు సార్లు మాత్ర మే నీరు సరఫరా అవుతున్న సందర్భాలు ఉన్నాయి. 

తవ్వకాల్లో తుక్కవుతున్న పైప్‌లైన్లు
కార్పొరేషన్‌ పరిధిలో రూ.1100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఎల్‌ఎండ్‌టీ, మెగా కంపెనీలు దక్కించుకోగా ఆయా కంపెనీలు సబ్‌ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాయి. దీంతో సబ్‌కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో వాటర్‌ పైప్‌లైన్‌లు ధ్వంసమవుతున్నాయి. పబ్లిక్‌ హెల్త్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు కావడంతో కార్పొరేషన్‌ అధికారులకు ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయో కూడా స్పష్టత లేకుండాపోతోంది. కార్పొరేషన్, పబ్లిక్‌ హెల్త్‌ శాఖ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్ల తవ్వకాల్లో మున్సిపల్‌ వాటర్‌ పైప్‌లైన్‌ దెబ్బతింటుండడంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వాటర్‌ పైప్‌లైన్‌ ఎక్కడ పగిలిందో తెలుసుకునేందుకే కార్పొరేషన్‌ అధికారులు వారాలపాటు సమయం తీసుకుంటున్నారు. దీంతో ప్రజలకు అవస్థ తప్పడం లేదు.

150 అడుగులు బోర్లు వేయాల్సిందే..
నెల్లూరు నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, ఎన్‌టీఆర్‌నగర్, మైపాడుగేటు. కిసాన్‌నగర్, వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, జండావీధి, ఫత్తేకాన్‌పేట తదితర ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం వరకు 50 అడుగుల లోతులో బోర్లు వేస్తే నీరు వచ్చేది. అయితే ప్రస్తుతం పెన్నాకు సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో సైతం 100 అడుగులు పైనే బోర్లు వేయాల్సి వస్తోంది. ఇక పొదలకూరు రోడ్డు, దర్గామిట్ట, అయ్యప్పగుడి ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 150 అడుగుల వరకు బోరు వేయాల్సి వస్తోంది. వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. భవిష్యత్‌లో నీటికి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

► జూన్‌ నెలలో స్టౌన్‌హౌస్‌పేటలోని జలకన్య బొమ్మ వద్ద ఓ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో బాలాజీనగర్‌లోని దాదాపు 5000 కుటుంబాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. కార్పొరేషన్‌ అధికారులు వారం రోజులపాటు ఎక్కడ సమస్య ఉందో తెలుసుకునేందుకు అన్వేషించాల్సి వచ్చింది. అయితే ఓ కంపెనీ జరిపిన రోడ్ల తవ్వకాల్లో పైప్‌లైన్‌ దెబ్బతిన్నట్లు తెలిసింది.

లెక్కల్లోనే ట్యాంకర్‌ నీరు సరఫరా 
పొదలకూరురోడ్డు, చంద్రబాబునగర్, భగత్‌సింగ్‌కాలనీ, సమతానగర్, నాగమ్మకాలనీ, ఆర్‌టీసీ కాలనీ, రామ్‌నగర్, కొత్తూరు, వేదాయపాళెం, బుజబుజనెల్లూరు తదితర శివారు ప్రాంతాలకు 22 ట్యాంకర్‌లతో నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు 117 ట్రిప్పులు నీరు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే ప్రతి రోజూ నీటి ట్యాంకర్‌ రాకపోవడంతో నీటి కోసం ఆ ప్రాంతాల్లోని  ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. 

మురుగునీరు సరఫరా..
25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ ద్వారానే కార్పొరేషన్‌ నగర ప్రజలకు నీటిని సరఫరా చేస్తోంది. పాత పైప్‌లైన్‌ కావడంతో కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్‌కు రంధ్రాలు ఏర్పడి మురుగునీరు సరఫరా అవుతోంది. మరోవైపు భూగర్భడ్రైనేజీ పనుల కారణంగా కార్పొరేషన్‌ వాటర్‌ పైప్‌లైన్‌లు దెబ్బతింటున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలకు మురుగునీరే దిక్కైంది. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, స్టౌన్‌హౌస్‌పేట, రంగనాయకులపేట, కోటమిట్ట, మన్సూర్‌నగర్, వెంగళరావునగర్‌ తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాలాజీనగర్‌లో వారం రోజులుగా నీరు రావడం లేదు. పైప్‌లైన్‌ పగలడం కారణంగా వారం రోజులుగా దాదాపు 20 వేల మంది తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు

► మూలాపేటలోని నీలగిరి సంఘం ప్రాంతాల్లో ఇటీవల తాగునీటి పైప్‌లైన్‌ పనులు చేస్తున్న సమయంలో మున్సిపల్‌ వాటర్‌ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో మూలాపేటలోని వందల ఇళ్లకు వారం రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులకు చెప్పినా మరమ్మతులు చేస్తున్నామని, పని పూర్తయ్యే వరకు వేచి చూడాలని సూచన ఇవ్వడం గమనార్హం. 

► స్టౌన్‌హౌస్‌పేటలో భూగర్భ డ్రైనేజీ పనుల నేపథ్యంలో వాటర్‌ పైప్‌లైన్‌కు రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో 20 రోజులపాటు మురుగునీరు సరఫరా అయ్యాయి. కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement