Municipal Minister Narayana
-
నీళ్లో నారాయణా..!
ఓ వైపు కార్పొరేషన్ అధికారులు నీళ్లు ఇవ్వరు.. మరోవైపు భూగర్భజలాలు అడుగంటి బోర్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆరు నెలలుగా నెల్లూరు ప్రజలు గుక్కెడు నీటికోసం కటకటలాడుతున్నారు..నిత్యం 105ఎంఎల్డీ నీటిని నెల్లూరు నగరవాసులకు అందించాల్సి ఉంది. అందులో సగం కూడా సరఫరా కావడం లేదు. నీళ్ల కోసం కార్పొరేషన్ అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. సాక్షాత్తూ మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ నివాసం ఉంటున్న నగరంలోనే నిధుల్లేవ్.. నీళ్లు ఇవ్వలేమంటున్నారు అధికారులు. ‘నీళ్లో నారాయణా’ అంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నెల్లూరు సిటీ: నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు మున్సిపల్ పైప్లైన్ల ద్వారా వచ్చేనీరు నిలిచిపోవడం.. మరోవైపు భూమిలో నీళ్లు ఇంకిపోవడంతో ఆరు నెలలుగా ప్రజలు నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాల పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రోడ్ల తవ్వకాలు జరిపిన సమయంలో మున్సిపల్ వాటర్ పైప్‌లు దెబ్బతింటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సరఫరా వారాల తరబడి నిలిచిపోతోంది. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లు, 1.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. సుమారు 7 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు రోజూ 105ఎంఎల్డీ నీటిని అందించాల్సి ఉంది. అయితే కేవలం 85ఎంఎల్డీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 60ఎంఎల్డీ నీటిని కూడా సరఫరా కావడం లేదు. పెన్నానది, బుజ్జమ్మరేవు, సమ్మర్ స్టోరేజీట్యాంకు నుంచి కార్పొరేషన్ తాగునీటిని సరఫరా చేస్తోంది. రోజుకు 85ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. పెన్నానది నుంచి 49 ఎంఎల్డీ, బుజ్జమ్మరేవు నుంచి 6 ఎంఎల్డీ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి 18 ఎంఎల్డీ, మిగిలిన నీటిని బోర్‌వెల్స్ నుంచి 12 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు, మూడు సార్లు మాత్ర మే నీరు సరఫరా అవుతున్న సందర్భాలు ఉన్నాయి. తవ్వకాల్లో తుక్కవుతున్న పైప్లైన్లు కార్పొరేషన్ పరిధిలో రూ.1100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఎల్ఎండ్టీ, మెగా కంపెనీలు దక్కించుకోగా ఆయా కంపెనీలు సబ్ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాయి. దీంతో సబ్‌కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో వాటర్ పైప్లైన్లు ధ్వంసమవుతున్నాయి. పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు కావడంతో కార్పొరేషన్ అధికారులకు ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయో కూడా స్పష్టత లేకుండాపోతోంది. కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్ల తవ్వకాల్లో మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ దెబ్బతింటుండడంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వాటర్ పైప్‌లైన్ ఎక్కడ పగిలిందో తెలుసుకునేందుకే కార్పొరేషన్ అధికారులు వారాలపాటు సమయం తీసుకుంటున్నారు. దీంతో ప్రజలకు అవస్థ తప్పడం లేదు. 150 అడుగులు బోర్లు వేయాల్సిందే.. నెల్లూరు నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, ఎన్టీఆర్నగర్, మైపాడుగేటు. కిసాన్‌నగర్, వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, జండావీధి, ఫత్తేకాన్‌పేట తదితర ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం వరకు 50 అడుగుల లోతులో బోర్లు వేస్తే నీరు వచ్చేది. అయితే ప్రస్తుతం పెన్నాకు సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో సైతం 100 అడుగులు పైనే బోర్లు వేయాల్సి వస్తోంది. ఇక పొదలకూరు రోడ్డు, దర్గామిట్ట, అయ్యప్పగుడి ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 150 అడుగుల వరకు బోరు వేయాల్సి వస్తోంది. వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. భవిష్యత్‌లో నీటికి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ► జూన్ నెలలో స్టౌన్‌హౌస్‌పేటలోని జలకన్య బొమ్మ వద్ద ఓ పైప్‌లైన్ పగిలింది. దీంతో బాలాజీనగర్‌లోని దాదాపు 5000 కుటుంబాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. కార్పొరేషన్ అధికారులు వారం రోజులపాటు ఎక్కడ సమస్య ఉందో తెలుసుకునేందుకు అన్వేషించాల్సి వచ్చింది. అయితే ఓ కంపెనీ జరిపిన రోడ్ల తవ్వకాల్లో పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు తెలిసింది. లెక్కల్లోనే ట్యాంకర్ నీరు సరఫరా పొదలకూరురోడ్డు, చంద్రబాబునగర్, భగత్‌సింగ్‌కాలనీ, సమతానగర్, నాగమ్మకాలనీ, ఆర్టీసీ కాలనీ, రామ్‌నగర్, కొత్తూరు, వేదాయపాళెం, బుజబుజనెల్లూరు తదితర శివారు ప్రాంతాలకు 22 ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు 117 ట్రిప్పులు నీరు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే ప్రతి రోజూ నీటి ట్యాంకర్ రాకపోవడంతో నీటి కోసం ఆ ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. మురుగునీరు సరఫరా.. 25 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారానే కార్పొరేషన్ నగర ప్రజలకు నీటిని సరఫరా చేస్తోంది. పాత పైప్‌లైన్ కావడంతో కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్‌కు రంధ్రాలు ఏర్పడి మురుగునీరు సరఫరా అవుతోంది. మరోవైపు భూగర్భడ్రైనేజీ పనుల కారణంగా కార్పొరేషన్ వాటర్ పైప్లైన్లు దెబ్బతింటున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలకు మురుగునీరే దిక్కైంది. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, స్టౌన్‌హౌస్‌పేట, రంగనాయకులపేట, కోటమిట్ట, మన్సూర్‌నగర్, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాలాజీనగర్‌లో వారం రోజులుగా నీరు రావడం లేదు. పైప్‌లైన్ పగలడం కారణంగా వారం రోజులుగా దాదాపు 20 వేల మంది తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు ► మూలాపేటలోని నీలగిరి సంఘం ప్రాంతాల్లో ఇటీవల తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తున్న సమయంలో మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ పగిలింది. దీంతో మూలాపేటలోని వందల ఇళ్లకు వారం రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులకు చెప్పినా మరమ్మతులు చేస్తున్నామని, పని పూర్తయ్యే వరకు వేచి చూడాలని సూచన ఇవ్వడం గమనార్హం. ► స్టౌన్‌హౌస్‌పేటలో భూగర్భ డ్రైనేజీ పనుల నేపథ్యంలో వాటర్ పైప్‌లైన్‌కు రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో 20 రోజులపాటు మురుగునీరు సరఫరా అయ్యాయి. కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. -
ఆ మంత్రి ఉద్యోగులకు ఏం చేస్తారు?
మంత్రి నారాయణపై మండిపడ్డ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు విశాఖపట్నం సిటీ: ‘మున్సిపల్ మంత్రి నారాయణకు ప్రజారోగ్యం గురించి పట్టదు. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీనే. ఆయన బిజీ అయితే అయి ఉండొచ్చు... పుష్కరాల్లో నిండా మునిగి ఉండొచ్చు... ఏదో ఘడియ ఖాళీ దొరికినప్పుడైనా స్పందించాలి కదా’ అంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు ధ్వజమెత్తారు. విశాఖలో ఆదివారం విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని..కార్మికులతో చర్చలు జరపాలని కోరేందుకు అయిదు రోజులు పాటు ఆయన్ను కలుసుకునేందుకు ప్రయత్నించానన్నారు. ఆఖరుకు రాజమండ్రికి వెళ్లి గన్మన్లను బతిమాలుకుని మంత్రిని కలిశానన్నారు. శాసన సభా బీజేపీ పక్ష నేతనైన తనకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. -
నారాయణ మంత్రం!
⇒ సీఎం బాబు, మంత్రి నారాయణ కనుసన్నల్లో రాజధానిప్లాన్ ⇒ బాబు సూచన మేరకు తుది దశ మాస్టర్‌ప్లాన్‌లో మార్పుచేర్పులు! ⇒ వీటిని నారాయణ ద్వారా ఎప్పటికప్పుడు సింగపూర్ కంపెనీలకు చేరవేత సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్‌ప్లాన్ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ కనుసన్నల్లో సాగుతోంది. సీఎం చంద్రబాబు ఏం చెబితే దానినే సింగపూర్ చేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు సూచించిన మేరకు తదుపరి దశ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిని మంత్రి నారాయణ ద్వారా ఎప్పటికప్పుడు సింగపూర్ సంస్థలకు చేరుస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ సంస్థలు జురాంగ్, సుర్భానాలు ఉమ్మడిగా తయారుచేస్తుండడం తెలిసిందే. తొలిదశ మాస్టర్‌ప్లాన్‌ను అందించిన ఈ సంస్థలు ప్రస్తుతం మరో రెండు దశల తుది విడత ప్రణాళికల తయారీలో నిమగ్నమయ్యాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ప్రణాళికలే కీలకం. గ త మార్చి 30న సింగపూర్‌లో తొలిదశ మాస్టర్‌ప్లాన్‌ను చంద్రబాబుకు అందజేసినప్పుడు.. కీలకమైన మిగిలిన రెండు దశల ప్రణాళికలను జూన్‌నాటికి అందజేస్తామని సింగపూర్ వాణిజ్యమంత్రి ఎస్.ఈశ్వరన్ ప్రకటించడం విదితమే. అంతా నారాయణ ద్వారానే.. రాజధాని ప్రాంతంలో కీలక నిర్మాణాలు ఎక్కడెక్కడ రావాలన్న అంశంపై ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మార్పుచేర్పులపై ఎప్పటికప్పుడు సింగపూర్ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం నుంచి సమాచారాన్ని చేరుస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మార్పుచేర్పులపై ఆయా సంస్థలతో మంత్రే సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రి నారాయణ, ఆయన శాఖకు చెందిన ఉన్నతాధికారులు మినహా మార్పుచేర్పుల విషయాలను మరే ఇతర అధికారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. నూతన రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి రంగానికి చెందిన పరిశ్రమలను ప్రతిపాదించాలి? ఎక్కడ ఎలాంటి నిర్మాణాలను చేపట్టాలి? వంటి విషయాలను సింగపూర్ కంపెనీలకు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మున్సిపల్‌శాఖ సింగపూర్ కంపెనీలకు అందజేస్తోంది. అలాగే నూతన రాజధానిలో ఆయా నిర్మాణాలకయ్యే ఖర్చు అంచనాలను కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దలే సింగపూర్ కంపెనీలకు తెలియజేసి ఆ మేరకు మార్చాలని కోరుతున్నారు. అందుకనుగుణంగా సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నాయి. వారానికోసారి సింగపూర్‌కు.. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన తుది దశకు చేరుతున్నందున తాము చేసిన మార్పుచేర్పులను మరోసారి పరిశీలించడానికి మంత్రి నారాయణతో ఆయన ఎంచుకున్న అధికారులు సింగపూర్ వెళ్లాలని నిర్ణయించారు. సీఎం సూచనల మేరకు.. తుది విడత మాస్టర్ ప్రణాళిక రూపకల్పనను పర్యవేక్షించడంతోపాటు అది తుదిరూపు సంతరించుకునేదాకా నాలుగు వారాలపాటు వారానికోరోజు చొప్పున మంత్రి నారాయణ, మున్సిపల్ అధికారులు సింగపూర్ వెళ్లనున్నారు. వీరి పర్యటనలకు సంబంధించిన ప్రతిపాదనలను మున్సిపల్ శాఖ మంగళవారం సాధారణ పరిపాలన శాఖకు పంపించింది. కాగా సింగపూర్ కంపెనీ ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే సింగపూర్ కంపెనీలు ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయట్లేదని, అందుకు ప్రతిఫలంగా నూతన రాజధానిలో భూములను కేటాయించేందుకు అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్టు గతంలోనే వార్తలు రావడం తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్రప్రభుత్వం నూతన రాజధాని నగర అభివృద్ధి పేరుతోఅంతర్గత ప్రతిపాదనలను రూపొందించింది. సింగపూర్ మంత్రి హోటల్ బిల్లు రూ.4.03 లక్షలు ⇒ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదారాబాద్: సింగపూర్ వాణిజ్య మంత్రి ఎస్.ఈశ్వరన్‌తోపాటు ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందం గత జనవరిలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఓ హోటల్లో బసచేసినందుకైన బిల్లు రూ.4.03 లక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది జనవరి 11 నుంచి 13వ తేదీ వరకూ మూడు రోజులపాటు సింగపూర్ బృందం ఇక్కడి స్టార్ హోటర్‌లో బస చేసింది. కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వచ్చినందున ఆ బిల్లును ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బిల్లును సంబంధిత హోటల్‌కు చెల్లించాలని సీఆర్డీఏను ఆదేశించారు. వాస్తవానికి ఈ బిల్లును మున్సిపల్ అధికారులు చెల్లించాలని ఫైలు వచ్చింది. అయితే ఈ ఫైలును మున్సిపల్‌శాఖ తిరస్కరించింది. వచ్చిన ఫైలును వెంటనే జీఏడీ పొలిటికల్ విభాగానికి తిప్పిపంపించింది. అయితే ప్రభుత్వమే బిల్లు చెల్లించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ భారాన్ని ఇప్పుడు సీఆర్డీఏపై వేసింది. విధిలేని పరిస్థితుల్లో సీఆర్డీఏ నుంచి ఈశ్వరన్ హోటల్ బిల్లు రూ.4.03 లక్షలను చెల్లిస్తున్నారు. కాగా సింగపూర్‌కు చెందిన సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్(ఎస్సీఈ), సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సీఎల్సీ) సంస్థలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమానికి అందించిన కన్సల్టెన్సీ సేవలకుగాను లక్షా యాభైవేల అమెరికన్ డాలర్లతో పాటు పన్నులను అదనంగా కలిపి(దాదాపు కోటీ ఐదు లక్షల రూపాయలు) ప్రభుత్వమే చెల్లించింది. డీపీఆర్‌కు రూ.500 కోట్లు మాస్టర్‌ప్లాన్ రూపొందించడానికి 2014 డిసెంబర్ 8న సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్(ఐఈ-సింగపూర్)తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఐఈ మాత్రం మాస్టర్‌ప్లాన్ తయారీ బాధ్యతను కార్పొరేట్ సంస్థలు సుర్భానా, జురాంగ్లకు అప్పగించింది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న తొలిదశలో ఉచితంగా మాస్టర్‌ప్లాన్ అందిస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతర్గతంగా ప్రభుత్వం ప్రతిపాదించింది భిన్నంగా ఉంది. ‘కన్సల్టెన్సీ చార్జెస్ ఫర్ మాస్టర్‌ప్లానింగ్ అండ్ డీపీఆర్ ప్రిపరేషన్’ కోసం ఏకంగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దీనిపై సింగపూర్ కంపెనీలతో అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఈ ప్రణాళికలన్నింటినీ అందజేయగానే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాల్సిఉంది. ఆ మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ సంస్థలను ఎంపిక చేయడానికి వీలుగా స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించడం తెలిసిందే. -
పట్టణ వాసులకు ‘పన్నుపోటు’
పార్వతీపురంటౌన్: పట్టణవాసులపై త్వరలో ఆస్తిపన్ను భారం పడనుంది. పట్టణాలను బలోపేతం చేయాలనే నెపంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆస్తిపన్ను బాదుడుకు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2002 నుంచి ఇప్పటి వరకు ఆస్తిపన్ను పెంచలేదని, అందుకే పెంచుతున్నట్లు ఈనెల 20న విజయవాడలో మున్సి పల్ శాఖామంత్రి నారాయణ ప్రక టించిచారు. దీంతో పట్టణవాసుల్లో పన్నుపోటు గుబులు ప్రారంభమైంది. ఇప్పటికే 12వేల మంది ఇళ్ల యజమానులు సంవత్సరానికి రూ.2.34 కోట్లు పన్ను రూపంలో మున్సిపాల్టీకి చెల్లిస్తున్నారు. నూతనంగా విధించే పన్ను వల్ల అదనంగా కోటి రూపాయల భారం పడనుంది. అంతే కాకుండా మున్సిపల్ చైర్పర్సన్లకు ఆస్తిపన్ను పెంపుదలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు మూడు నెలల క్రితం మున్సిపల్ మంత్రి ప్రకటించారు. గతంలో ఉన్న ఆస్తిపన్ను కంటే నూతనంగా 20 నుంచి 40 శాతం పన్ను పెంచే అవకాశం ఉందని మున్సిపల్ రెవె న్యూ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా మున్సిపాల్టీని అభివృద్ధి బాట లో నడిపించాలనే సాకుతో ఏటా 3 శాతం నుంచి 6 పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. ఆస్తిపన్ను పెంపునకు సంబంధించి త్వరలో ప్రభుత్వం జీవో విడుదల చేయనున్నట్లు మున్సిపల్ మంత్రి స్పష్టం చేశారు. ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం ఆస్తిపన్ను పెంచడమే సరైన మార్గమని ప్రభుత్వం భా వించడం సరికాదని ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు పలు పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అధ్వానంగా తాగునీటి సరఫరా గత 54 ఏళ్లుగా పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీటి సరఫరా అధ్వానంగా ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిసిన విషయమే అయినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ ఏడాది వర్షాకాలంలో మూడు నెలల పాటు 30 వార్డుల్లో ఉన్న ప్రజలు కొళాయిల నుంచి వచ్చిన బురదనీరే తాగా రు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో స్థానికులు తాగు నీటికి నిత్యం యాతన పడుతున్నారు. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ మున్సిపాల్టీలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. వీధీదీపాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణతో పాటు సిబ్బంది కొరతతో వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి. దీంతో నివాసితులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మున్సి పాల్టీలో ఇన్ని సమస్యలు నెల కొని ఉండగా నూతనంగా పన్నులభారాన్ని వేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుండడంతో వైఎస్సార్ సీపీతో పాటు పలు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి.