నారాయణ మంత్రం! | Singapore completes phase-1 of master plan for new AP capital | Sakshi
Sakshi News home page

నారాయణ మంత్రం!

Published Wed, Apr 29 2015 2:10 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

నారాయణ మంత్రం! - Sakshi

నారాయణ మంత్రం!

సీఎం బాబు, మంత్రి నారాయణ కనుసన్నల్లో రాజధానిప్లాన్
బాబు సూచన మేరకు తుది దశ మాస్టర్‌ప్లాన్‌లో మార్పుచేర్పులు!
వీటిని నారాయణ ద్వారా ఎప్పటికప్పుడు సింగపూర్ కంపెనీలకు చేరవేత

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్‌ప్లాన్ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ కనుసన్నల్లో సాగుతోంది. సీఎం చంద్రబాబు ఏం చెబితే దానినే సింగపూర్ చేస్తోంది.

రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు సూచించిన మేరకు తదుపరి దశ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిని మంత్రి నారాయణ ద్వారా ఎప్పటికప్పుడు సింగపూర్ సంస్థలకు చేరుస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ సంస్థలు జురాంగ్, సుర్భానాలు ఉమ్మడిగా తయారుచేస్తుండడం తెలిసిందే.

తొలిదశ మాస్టర్‌ప్లాన్‌ను అందించిన ఈ సంస్థలు ప్రస్తుతం మరో రెండు దశల తుది విడత ప్రణాళికల తయారీలో నిమగ్నమయ్యాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ప్రణాళికలే కీలకం. గ త మార్చి 30న సింగపూర్‌లో తొలిదశ మాస్టర్‌ప్లాన్‌ను చంద్రబాబుకు అందజేసినప్పుడు.. కీలకమైన మిగిలిన రెండు దశల ప్రణాళికలను జూన్‌నాటికి అందజేస్తామని సింగపూర్ వాణిజ్యమంత్రి ఎస్.ఈశ్వరన్ ప్రకటించడం విదితమే.
 
అంతా నారాయణ ద్వారానే..
రాజధాని ప్రాంతంలో కీలక నిర్మాణాలు ఎక్కడెక్కడ రావాలన్న అంశంపై ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మార్పుచేర్పులపై ఎప్పటికప్పుడు సింగపూర్ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం నుంచి సమాచారాన్ని చేరుస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మార్పుచేర్పులపై ఆయా సంస్థలతో మంత్రే సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రి నారాయణ, ఆయన శాఖకు చెందిన ఉన్నతాధికారులు మినహా మార్పుచేర్పుల విషయాలను మరే ఇతర అధికారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

నూతన రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి రంగానికి చెందిన పరిశ్రమలను ప్రతిపాదించాలి? ఎక్కడ ఎలాంటి నిర్మాణాలను చేపట్టాలి? వంటి విషయాలను సింగపూర్ కంపెనీలకు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మున్సిపల్‌శాఖ సింగపూర్ కంపెనీలకు అందజేస్తోంది. అలాగే నూతన రాజధానిలో ఆయా నిర్మాణాలకయ్యే ఖర్చు అంచనాలను కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దలే సింగపూర్ కంపెనీలకు తెలియజేసి ఆ మేరకు మార్చాలని కోరుతున్నారు. అందుకనుగుణంగా సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నాయి.
 
వారానికోసారి సింగపూర్‌కు..
మాస్టర్‌ప్లాన్ రూపకల్పన తుది దశకు చేరుతున్నందున తాము చేసిన మార్పుచేర్పులను మరోసారి పరిశీలించడానికి మంత్రి నారాయణతో ఆయన ఎంచుకున్న అధికారులు సింగపూర్ వెళ్లాలని నిర్ణయించారు. సీఎం సూచనల మేరకు.. తుది విడత మాస్టర్ ప్రణాళిక రూపకల్పనను పర్యవేక్షించడంతోపాటు అది తుదిరూపు సంతరించుకునేదాకా నాలుగు వారాలపాటు వారానికోరోజు చొప్పున మంత్రి నారాయణ, మున్సిపల్ అధికారులు సింగపూర్ వెళ్లనున్నారు.

వీరి పర్యటనలకు సంబంధించిన ప్రతిపాదనలను మున్సిపల్ శాఖ మంగళవారం సాధారణ పరిపాలన శాఖకు పంపించింది. కాగా సింగపూర్ కంపెనీ ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే సింగపూర్ కంపెనీలు ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయట్లేదని, అందుకు ప్రతిఫలంగా నూతన రాజధానిలో భూములను కేటాయించేందుకు అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్టు గతంలోనే వార్తలు రావడం తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్రప్రభుత్వం నూతన రాజధాని నగర అభివృద్ధి పేరుతోఅంతర్గత ప్రతిపాదనలను రూపొందించింది.
 
సింగపూర్ మంత్రి హోటల్ బిల్లు రూ.4.03 లక్షలు
చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదారాబాద్: సింగపూర్ వాణిజ్య మంత్రి ఎస్.ఈశ్వరన్‌తోపాటు ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందం గత జనవరిలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఓ హోటల్‌లో బసచేసినందుకైన బిల్లు రూ.4.03 లక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది జనవరి 11 నుంచి 13వ తేదీ వరకూ మూడు రోజులపాటు సింగపూర్ బృందం ఇక్కడి స్టార్ హోటర్‌లో బస చేసింది.

కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వచ్చినందున ఆ బిల్లును ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బిల్లును సంబంధిత హోటల్‌కు చెల్లించాలని సీఆర్‌డీఏను ఆదేశించారు. వాస్తవానికి ఈ బిల్లును మున్సిపల్ అధికారులు చెల్లించాలని ఫైలు వచ్చింది. అయితే ఈ ఫైలును మున్సిపల్‌శాఖ తిరస్కరించింది. వచ్చిన ఫైలును వెంటనే జీఏడీ పొలిటికల్ విభాగానికి తిప్పిపంపించింది. అయితే ప్రభుత్వమే బిల్లు చెల్లించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ భారాన్ని ఇప్పుడు సీఆర్‌డీఏపై వేసింది.

విధిలేని పరిస్థితుల్లో సీఆర్‌డీఏ నుంచి ఈశ్వరన్ హోటల్ బిల్లు రూ.4.03 లక్షలను చెల్లిస్తున్నారు. కాగా సింగపూర్‌కు చెందిన సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్‌ప్రైజెస్(ఎస్‌సీఈ), సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సీఎల్‌సీ) సంస్థలు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమానికి అందించిన కన్సల్టెన్సీ సేవలకుగాను లక్షా యాభైవేల అమెరికన్ డాలర్లతో పాటు పన్నులను అదనంగా కలిపి(దాదాపు కోటీ ఐదు లక్షల రూపాయలు) ప్రభుత్వమే చెల్లించింది.
 
డీపీఆర్‌కు రూ.500 కోట్లు
మాస్టర్‌ప్లాన్ రూపొందించడానికి 2014 డిసెంబర్ 8న సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్(ఐఈ-సింగపూర్)తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఐఈ మాత్రం మాస్టర్‌ప్లాన్ తయారీ బాధ్యతను కార్పొరేట్ సంస్థలు సుర్భానా, జురాంగ్‌లకు అప్పగించింది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న తొలిదశలో ఉచితంగా మాస్టర్‌ప్లాన్ అందిస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతర్గతంగా ప్రభుత్వం ప్రతిపాదించింది భిన్నంగా ఉంది.

‘కన్సల్టెన్సీ చార్జెస్ ఫర్ మాస్టర్‌ప్లానింగ్ అండ్ డీపీఆర్ ప్రిపరేషన్’ కోసం ఏకంగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దీనిపై సింగపూర్ కంపెనీలతో అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్టు సమాచారం.  ఈ ప్రణాళికలన్నింటినీ అందజేయగానే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాల్సిఉంది. ఆ మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ సంస్థలను ఎంపిక చేయడానికి వీలుగా స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించడం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement