ఆ మంత్రి ఉద్యోగులకు ఏం చేస్తారు?
మంత్రి నారాయణపై మండిపడ్డ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం సిటీ: ‘మున్సిపల్ మంత్రి నారాయణకు ప్రజారోగ్యం గురించి పట్టదు. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీనే. ఆయన బిజీ అయితే అయి ఉండొచ్చు... పుష్కరాల్లో నిండా మునిగి ఉండొచ్చు... ఏదో ఘడియ ఖాళీ దొరికినప్పుడైనా స్పందించాలి కదా’ అంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు ధ్వజమెత్తారు. విశాఖలో ఆదివారం విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని..కార్మికులతో చర్చలు జరపాలని కోరేందుకు అయిదు రోజులు పాటు ఆయన్ను కలుసుకునేందుకు ప్రయత్నించానన్నారు. ఆఖరుకు రాజమండ్రికి వెళ్లి గన్‌మన్‌లను బతిమాలుకుని మంత్రిని కలిశానన్నారు. శాసన సభా బీజేపీ పక్ష నేతనైన తనకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు.