చిక్కుల్లో నేత | Handloom Workers Problems In Nellore | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో నేత

Published Tue, Aug 7 2018 11:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Handloom Workers Problems In Nellore - Sakshi

నూలు వడుకుతున్న మహిళ

అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుల బతుకులు నానాటికి దుర్భరంగా మారుతున్నాయి. మగ్గంపై రేయింబవళ్లు కష్టపడినా మూడు పూటలా నోట్లోకి ఐదు వేళ్లు పోవడంలేదు. వీరి కష్టానికి ఖరీదు దక్కడంలేదు. అపర బ్రహ్మలుగా కీర్తించబడుతున్న చేనేతలకు చేయూత ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. 

వెంకటగిరి (నెల్లూరు):  చేనేతల కష్టానికి ఖరీదు అందడంలేదు. చేనేత పరిశ్రమలో ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఆదుకోవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మాస్టర్‌ వీవర్లు కార్మికులను దోచుకుంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికుల్లో దయనీయస్థితి ఏర్పడింది. కొందరు చేనేత వృత్తిపై జీవించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో మగ్గం అటకెక్కింది. జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వెంకటగిరి, చెన్నూరు, ఇందుకూరుపేట, మడమనూరు, దంపూరు, వావిళ్ల, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, పాటూరు, నేదురుమల్లి, కసుమూరు, పాలిచర్లపాడు ప్రాంతాల్లో చేనేత కార్మికులు నివసిస్తున్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు మగ్గంలో నలిగిపోతున్నారు.
 
విదేశాల్లో చేనేత వస్త్రాలకు ఆదరణ
అభివృద్ధి చెందిన దేశాల్లో చేనేత వస్త్రాలు ధరిం చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందంతో పాటు దర్పణానికి ప్రతీ కలుగా చేనేత వస్త్రాలు నిలుస్తున్నాయి. చేనేత వస్త్రాలు ఆరో గ్యానికి ఎంతో ఉపయుక్తం కావడంతో ఈ వస్త్రాలకు విదేశాల్లో సైతం డిమాండ్‌ పెరుగుతుంది. చేనేత వస్త్రాలకు గిరాకీ ఉన్నా చేనేత కళాకారు ల బతుకులు మాత్రం దిగజారిపోతున్నాయి. నేతల బతుకులను రక్షించాల్సిన చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. స్వాతంత్య్రం కోసం ఉద్యమ స్ఫూర్తి ని రగిలించిన ఘనత చేనేత రంగానిదే. ఉద్యమసారథి మహాత్మాగాంధీ విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చిన ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేనేత వస్త్రాలపై పేటెంట్‌ హక్కును పొందిన ఘనత చేనేత కళాకారులదీ. కాగా వెంకటగిరి చీరలకు 2009లో జీఐ (జియాలాజికల్‌ ఐడెంటిఫికేషన్‌) గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపుతో తమ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి బతుకులు గాడిన పడుతాయనుకున్న నేత కళాకారులకు తొమ్మిదేళ్లుగా ప్రత్యేకంగా ఒరింగిదేమీ లేదు.
 
పరిశ్రమను బతికిస్తున్న సృజనాత్మకత
సృజనాత్మకశక్తిని ఉపయోగించి ఎన్నో కొత్త డిజైన్లను సృష్టించడంలో వెంకటగిరి చేనేత కళాకారులు సిద్ధహస్తులు. ఇక్కడి కార్మికుల సృజనాత్మకతో రూపుదిద్దుకున్నదే జాందానీ వర్క్‌ చీరలు. వెంకటగిరి చీరలకు జింధానీ వర్క్‌తో అంతర్జాతీయ ప్రఖ్యాతి ఉంది. చీర డిజైన్‌ నేయడంలో జాందానీ వర్క్‌ ఉంటే ఇరువైపులా ఒకే రకంగా డిజైన్‌ కనిపిస్తుంది. ఇటువంటి ప్రత్యేకతతో చీరలు నేయడం దేశంలో ఎక్కడా కనిపించదు. బంగ్లాదేశ్‌లో జాందానీ వర్క్‌తో చీరలు నేస్తారు. ఆ విధానంలో నైపుణ్యతను పెంచుకుని ఇక్కడి కార్మికులు ప్రత్యేకతను చాటుతున్నారు. జాంధానీ వర్క్‌తో మగ్గాల మీదనే నేయడం వలన ప్రత్యేకత ఉంది.
 
జాతీయ అవార్డులు.. మారని బతుకులు
రాష్ట్రపతి, ప్రధానిమంత్రి నుంచి జాతీయ అవార్డులు అందుకున్నా.. చేనేతల తలరాతలు మారడం లేదు. 1950లో వెంకటగిరి పట్టణానికి చెందిన బోగా వెంకటసుబ్బయ్య తొలిసారిగా జాతీయ చేనేత పురష్కారం అందుకున్నారు. ఆ తర్వాత గునకుల వెంకటేశు, బత్తిన సుబ్బరాయులు ఈ అవార్డులను అందుకున్నారు. 1987లో దొంతు సంజీవి, 1989లో డక్కిలి మండలం మార్లగుంటకు చెందిన కలవలపూడి వీరా స్వామి, 1996లో కూనా మల్లికార్జున్, 1999లో భో గా రాములు, 2000లో సజ్జావీరయ్య, 2005లో గౌరాబత్తిన రమణయ్య, పట్నం మునిరాజా జాతీ య (రాష్ట్రపతి) అవార్డులు పొందారు.  2014లో వెంకటగిరి పట్టణం బొప్పాపురానికి చెందిన లక్కా శ్రీనివాసులు వెంకటగిరి చీరలో గోవర్ధనుడైన రాధాకృష్ణులను నేసి జాతీయ (రాష్ట్రపతి) అవార్డుకు ఎంపికయ్యారు.

2015లో పట్నం చీరాలరెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది వెంకటగిరి పట్టణం కట్టెలవీధికి చెందిన పట్నం మునిబాబు జాతీయ అవార్డుకు ఎంపికయి మంగళవారం జమ్మూలో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో అవార్డు అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఎంతో మంది ఇక్కడి చేనేత కళాకారుడు జీవిత చరమాంకంలో కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కళాకారులును ఆదుకునేందుకు ప్రభుత్వం  చేయూ త ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 

చేనేతల డిమాండ్‌లు ఇవీ 

  • చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నేత కార్మికులకు సబ్సిడీ రుణాలు వంటి వాటి ద్వారా చేయూత అందించాలి.
  • నేత కార్మికులకు స్టాండ్‌ మగ్గాలు అందించాలి.
  • నేత పనులకు అవసరం అయిన నూలు, జరీ, వంటి ముడిసరుకులు సబ్సిడీపై అందించేందుకు చేనేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో డిపోలు ఏర్పాటు చేయాలి.
  • చేనేత ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలి.
  • చేనేతను జౌళి శాఖ నుంచి వేరు చేసి బడ్జెట్‌ నిధుల కేటాయింపులు నేరుగా చేనేతల సంక్షేమానికి వినియోగపడేలా చర్యలు తీసుకోవాలి.
  • చేనేతలకు పింఛన్, పక్కాఇల్లు, ఆరోగ్యబీమా వంటి పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వాలి. 

ప్రభుత్వం ప్రోత్సహించకుంటే కనుమరుగే 
చేనేత రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకుంటే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిల్క్‌సబ్సిడీ రూ.1000కి పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు ఇస్తున్న రూ.600 సబ్సిడీని సైతం నిలిపివేసింది. వడ్డీ లేకుండా చేనేతలకు రుణాలు అందించాలి. 
– కూనా మల్లికార్జున్, రాష్ట్రపతి అవార్డుగ్రహీత, వెంకటగిరి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement