మూలనపడ్డ మగ్గాలు
సాక్షి, అమరావతి: ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ తక్కువ అన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని.. రుణమాఫీ చేస్తామని ఎంతో ఆర్భాటంగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు వాటి ఊసే మరిచారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం పేరుతో మూడు రోజులుగా ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అధికార యంత్రాంగమంతా అక్కడే ఉంది. చేనేత కమిషనర్ కూడా చీరాలలోనే తిష్టవేశారు. ఈ నేపథ్యంలో చేనేత రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రత్యేక కథనం..
ప్రభుత్వం అంకెల గారడీ: రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 1,90,000 మంది ఉన్నారు. అనధికారికంగా మరో 60 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇంత జనాభా ఉన్న వీరికి ఏటా బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ నాలుగున్నరేళ్లల్లో కేవలం రూ.675కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో గత సంవత్సరం వరకు ఖర్చు చేసింది సుమారుగా రూ.189 కోట్లు మాత్రమే. చేనేతలకు చంద్రబాబు చేస్తున్న నమ్మకద్రోహానికి ఈ లెక్కలు అద్దంపడుతున్నాయి. ప్రభుత్వం తీరుతో చేనేత కార్మికులు వేరే వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. కూలీలుగా.. లారీ క్లీనర్లుగా.. బార్లలో సర్వర్లుగా.. పెట్రోల్ బంకుల్లో.. చేరుతున్నారు.
జీఎస్టీ భారంపై నోరు విప్పని సర్కార్
2017 జూన్ 3న జరిగిన జీఎస్‌టీ సమావేశంలో చేనేతపైన జీఎస్‌టీ వేయడాన్ని ఒప్పుకోబోమని ఒడిశా ప్రభుత్వం కరాఖండిగా చెప్పగా.. టీడీపీ ప్రభుత్వం అందుకు కనీస మద్దతు కూడా ఇవ్వలేదు. అలాగే, చేనేతల కోసం కార్పొరేషన్ అవసరం అని ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన తరువాత చంద్రబాబు చేనేత సలహా బోర్డ్ నియామకానికి ఆలోచిస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి ఇంటికి రూ.2000లు సబ్సిడీ ఇస్తామని జగన్ హామీ ఇవ్వగానే టీడీపీకి ఏం చేయాలో పాలుపోలేదు. కాగా, కనీస వేతన చట్టం ప్రకారం ప్రతీ చేనేత కార్మికునికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంది. కానీ, అదెక్కడా అమలుకావడంలేదు.
మాటలన్నీ నీటిమూటలే!
చేనేతలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం చేతల్లోకి వచ్చేసరికి మాత్రం రిక్తహస్తం చూపుతోంది. ఉదాహరణకు..
- చేనేతల త్రిప్ట్ ఫండ్ పథకానికి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసింది. రూ.1000 కోట్ల ప్రత్యేక నిధితో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు హామీ గాలిలో కలిసిపోయింది.
- రాజధాని అమరావతికి భూమి పూజ చేసిన సమయంలో రైతులకు ఇచ్చిన ఆప్కో వస్త్రాల బిల్లు రూ.3.88 కోట్లు ఇంతవరకు ఆప్కోకు చెల్లించలేదు.
- చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జనతా వస్త్ర పథకానికి రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా పవర్ లూమ్ వారికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించడం ఈ ప్రభుత్వ ద్వంద వైఖరికి అద్దంపడుతోంది.
- ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు కనీస పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు.
ఇలా చేస్తేనే చేనేతకు చేయూత
- జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ పది శాతం రాయితీతో నూలు ఇప్పించాలి.
- తమిళనాడులోని చేనేత విధానాన్ని అమలుచేయాలి.
- ప్రభుత్వ పాఠశాలలు, సాంఘీక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు చేనేత వస్త్రాలను మాత్రమే ఇవ్వాలి.
- ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒకసారైనా చేనేత వస్త్రాలను ధరించాలి. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
- సహకార సంఘాలను బలోపేతం చేసి వారికి ఇంకా నైపుణ్యం కల్పించి డిమాండ్ ఉన్న వస్త్రాలు నేసేలా కార్మికులను తీర్చిదిద్దాలి. ఇవన్నీ జరిగినప్పుడే చేనేత జాతీయ దినోత్సవాన్ని చేనేతలు పండుగలా జరుపుకుంటారు.
మోసపు మాటలు
చేనేత రుణాలు రద్దు చేస్తామన్నారు, చేసినట్లు నటించారు. కానీ, ఇంకా బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. చేనేత కార్మికుల్లో మరింత నైపుణ్యం పెరిగేలా శిక్షణ ఇవ్వటంలేదు. కనీస వేతనం అమలు చేయించడంలేదు. కార్మికులకు వృద్ధాప్యంలో ఉచిత వైద్యం అందటంలేదు. ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలే. పవర్‌లూమ్స్ వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు చేతి వృత్తి వారికి ఇవ్వడంలేదు.
బీరక సురేంద్ర, వైఎస్సాఆర్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment