
మునిగిన కారును ప్రొక్లెయినర్ సహాయంతో బయటకు తీయిస్తున్న పోలీసులు
బాపట్లటౌన్: గుంటూరు జిల్లా బాపట్ల వద్ద పేరలి డ్రెయిన్‌లోకి ఆదివారం ఉదయం కారు దూసుకుపోయిన ప్రమాదంలో వైద్యవిద్యార్థి బీదవోలు శ్రీనిధిరెడ్డి (22) మృతిచెందారు. మరో ఏడుగురు వైద్యవిద్యార్థులు గాయపడ్డారు. వారిని మత్స్యకారులు రక్షించారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు యర్రబల్లి సాయికేశవ్ (కూకట్‌పల్లి, హైదరాబాద్), బీదవోలు శ్రీనిధిరెడ్డి (ఎల్‌బీనగర్, హైదరాబాద్), గునుపాటి ఉదయ్‌కిరణ్‌రెడ్డి (గుంటూరు), గంధం లీలాశంకర్ బ్రహ్మయ్య (భీమవరం), వీరమాచి భానుప్రకాష్ (నాగపూర్, మహారాష్ట్ర) ఒక గదిలో ఉంటున్నారు. వీరికి సీనియర్లయిన చింతపట్ల కీర్తిరావు, దేవరకొండ నిహారిక, కంబంపాటి సాయితులసి మరో గదిలో ఉంటున్నారు. వీరంతా సూర్యలంక బీచ్‌లో ఉదయించే సూర్యుడిని చూడాలని నిర్ణయించుకున్నారు.
అందరూ కలిసి యర్రబల్లి సాయికేశవ్‌కు చెందిన కారులో శనివారం అర్ధరాత్రి 1.15 గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు సూర్యలంక తీరానికి చేరుకున్నారు. కొంతసేపు అక్కడున్నారు. విజయవాడలో మరో కార్యక్రమం ఉండటంతో తిరుగుపయనమయ్యారు. సూర్యలంక నుంచి బాపట్ల వైపు వస్తుండగా ఆదర్శనగర్ సమీపంలోని పేరలి డ్రైయిన్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. బీదవోలు శ్రీనిధిరెడ్డి నడుపుతున్న కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి డ్రెయిన్‌లోకి దూసుకెళ్లింది.
ఆ సమీపంలోని హోటల్‌లో టీ తాగేందుకు వచ్చిన ఆదర్శనగర్‌కు చెందిన మత్స్యకారులు కొక్కిలిగడ్డ నాగశ్రీను, సంగాని శేషు, చింతా లక్ష్మణ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే డ్రెయిన్‌లోకి దూకి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చారు. గాయపడిన ఎనిమిదిమందినీ 108 సహాయంతో చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే శ్రీనిధిరెడ్డి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కారును క్రేన్‌తో బయటకు తీయించిన రూరల్ సీఐ కె.శ్రీనివాసరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో రెండు సెల్‌ఫోన్లు, ఒక బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురి ప్రాణాలు కాపాడిన మత్స్యకారులను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment