మత్స్యకార చరిత్రలో సరికొత్త అధ్యాయం | CM YS Jaganmohan Reddy Lays Foundation For Fishing Harbour | Sakshi
Sakshi News home page

మత్స్యకార చరిత్రలో సరికొత్త అధ్యాయం

Published Sun, Nov 22 2020 2:38 AM | Last Updated on Sun, Nov 22 2020 8:55 AM

CM YS Jaganmohan Reddy Lays Foundation For Fishing Harbour - Sakshi

మత్స్యకారుల జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో వున్నాయనేది నా పాదయాత్రలో కళ్లారా చూశాను. మంచి చదువులు చదువుకోలేని, పక్కా ఇళ్లు లేని, సరైన ఆరోగ్య వసతి లేని, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని పరిస్థితి. పట్టిన చేపలకు తగిన ధర రాని దైన్యం. మన కళ్లెదుటే ఇవన్నీ కనిపించాయి. 

మత్స్యకారుల జీవితాలను మార్చడానికి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా అడుగులు వేశాం. నవరత్నాలు, ఇతర కార్యక్రమాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నాం. హామీలన్నీ అమలు చేశాం. వచ్చే ఏడాది రాష్ట్రంలో చేపలు, పీతలు, రొయ్యలను సాగు చేస్తున్న రైతుల జీవితాలను పూర్తిగా మార్చేందుకు కనీసం 30 శాతం ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే విక్రయించేలా జనతాబజార్లకు అనుసంధానం చేస్తున్నాం.  

సాక్షి, అమరావతి: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పరచడం ద్వారా వారి జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పాటు మత్స్య పరిశ్రమ రూపు రేఖలను మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్‌ సదుపాయం కోసం రూ.3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రూ.1,510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్‌ హార్బర్లకు, తొలి దశలో 25 ఆక్వా హబ్‌లకు శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని మత్స్యకారులు, ఆక్వా రైతులను ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. నవరత్నాల్లోని ప్రతిదాన్ని మత్స్యకారులకు అందిస్తూనే.. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారు. రాబోయే సంవత్సర కాలంలో చేపలు, రొయ్యలు, పీతలు సాగు చేసే రైతుల జీవితాలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ రోజు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని మనం ఒక పండుగగా జరుపుకుంటున్నామని చెప్పారు. మన దేశానికి 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్లు ఉందన్నారు. దేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం మనదని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలు మాత్రం పెద్దగా ఎందుకు మారలేదని మనమంతా మనస్సాక్షితో గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించాలన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
ఫిషింగ్‌ హార్బర్లకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, అధికారులు 

మత్స్యకారుల జీవితాలను చూసి చలించిపోయాను
► మన మత్స్యకారులు గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు వెళ్లి బతుకు దెరవు కోసం పని చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగిస్తున్న వారిని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపిన పరిస్థితి కనిపిస్తోంది.
► పాదయాత్రలో తీర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మత్స్యకార కుటుంబాలు చెప్పిన ఈ కన్నీటి గాథ నన్ను చలింపచేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంపై మన ఎంపీలు తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటు, నేను కూడా ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడాను. 
► ఆ జైళ్లలో మగ్గిపోతున్న మన వారిని తిరిగి ఇక్కడకు తీసుకు రావడానికి పెద్ద ప్రయత్నమే చేశాం. వారు తిరిగి వచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది.  

ఇప్పుడు నాలుగు.. త్వరలో మరో నాలుగు
► మత్స్య పరిశ్రమ పరంగా విస్తారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒక రాష్ట్రంగా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల పరిపాలనలో ఇలా ఆలోచన చేశాం. వీరి జీవితాలు ఎలాగైనా మార్చాలని అడుగులు ముందుకు వేశాం. 
► ఇందులో భాగంగా రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్‌లకు ఇవాళ (శనివారం) శంకుస్థాపన చేస్తున్నాం. 
► డిసెంబర్‌ 15 నాటికి ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, పనులు కూడా ప్రారంభమవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నాం. మూడు జెట్టీలు కూడా నిర్మిస్తాం. 
మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నమూనా 

25 ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన 
► రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో.. ఒక్కొక్కటి చొప్పున ఆక్వా హబ్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నాం. తొలి దశలో భాగంగా 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 
► 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాల కోసం దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నెన్నో..
► మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో దాదాపు మరో రూ.10 వేల కోట్లతో మరో మూడు పోర్ట్‌లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీటికి సంబంధించి మరో రెండు, మూడు నెలల్లోనే టెండర్లను ఫైనలైజ్‌ చేసే కార్యక్రమం చేస్తున్నాం.  
► సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు తొలి ఏడాది రూ.10 వేల చొప్పున 1,02,332 కుటుంబాలకు రూ.102.33 కోట్లు సాయం చేశాం. రెండో ఏడాది కోవిడ్‌ నేపథ్యంలో ఆరు నెలలు ముందుగానే 1,09,2307 కుటుంబాలకు దాదాపు రూ.110 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశాం. 
► దేశీయ, నాటు, తెడ్డు తెరచాప మత్స్యకారులకు కూడా సాయం చేశాం. డీజిల్‌ సబ్సిడీని లీటర్‌కు రూ.6 నుంచి రూ.9కి పెంచాం. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం.
► గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ బకాయి పెట్టిన రూ.78 కోట్లు 16,559 మత్స్యకారులకు చెల్లించాం. రూ.720 కోట్ల భారం భరిస్తూ 55 వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్‌ యూనిట్‌ రూ.1.50కే ఇస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో 794 మంది మత్స్య సహాయకులను నియమించాం. 
► ఆక్వా రైతులకు నాణ్యమైన మేత కోసం దేశంలోనే తొలిసారిగా ఏపీ ఫిష్‌ ఫీడ్‌ చట్టాన్ని చేశాం. నాణ్యమైన చేప, రొయ్య పిల్లల సరఫరాకు ఏపీ ఫిష్‌ సీడ్‌ కంట్రోల్‌ ఆర్డినెన్స్‌ కూడా జారీ చేశాం. ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.50 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆర్డినెన్స్‌ జారీ చేశాం.  

మత్స్యకారుల జీవితాల్లో వెలుగు 
మీరు ఈ రోజు నిజాంపట్నం పోర్టు అభివృద్ధికి రూ.451 కోట్లు కేటాయించి మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఈ పోర్టు అభివృద్ధి చెందితే అక్కడ శీతల గిడ్డంగిలు, ఐస్‌ ప్లాంట్స్, ఆక్షన్‌ హాల్స్, విశ్రాంతి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మాకు ఎన్నెన్నో అవకాశాలు అందివస్తాయి. ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఆయిల్‌ సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచారు. మత్స్యకారులం దరి తరఫున మీకు ధన్యవాదాలు.
– ఎన్‌.శివయ్య, మత్స్యకారుడు, నిజాంపట్నం గ్రామం, గుంటూరు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement