12 Years Ago, Virat Kohli Made His Test Debut On This Day, Take A Look At His Incredible Career - Sakshi
Sakshi News home page

Virat Kohli Test Career: పుష్కర కాలం పూర్తి.. లెక్కలేనన్ని ఘనతలు సొంతం

Published Tue, Jun 20 2023 12:00 PM | Last Updated on Tue, Jun 20 2023 12:35 PM

Virat Kohli Completed 12 Years For Test Cricket Test-Debut This Day - Sakshi

టీమిండియా స్టార్‌.. కింగ్‌ కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టి ఇవాళ్టికి పన్నేండేళ్లు. పుష్కరకాలం పూర్తి చేసుకున్న కోహ్లి టెస్టుల్లో ఈ తరంలో గొప్ప క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లి ఇదే రోజున(జూన్‌ 20న)2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా తరపున వేగంగా వంద టెస్టులు ఆడిన క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు.

ఈ 12 ఏళ్ల కాలంలో 109 మ్యాచ్‌లాడిన కోహ్లి 8479 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా కోహ్లి ఖాతాలో ఏడు డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడు డబుల్‌ సెంచరీలు అతను కెప్టెన్‌ అయ్యాకే రావడం విశేషం. అంతేకాదు టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్‌ సెంచరీల రికార్డు అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా తొలి స్థానంలో ఉన్నాడు.

2014లో ఎంఎస్‌ ధోని నుంచి టెస్టుల్లో సారధ్య బాధ్యతలు అందుకున్న కోహ్లి అనతికాలంలో టీమిండియాను టెస్టుల్లో నెంబర్‌వన్‌గా నిలిపాడు. ముఖ్యంగా కెప్టెన్‌గా కోహ్లి- హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి ద్వయం విదేశాల్లో భారత్‌కు విజయాలతో పాటు సిరీస్‌లు అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. మొత్తంగా టీమిండియా తరపున 68 టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన కోహ్లి 40 విజయాలు అందుకున్నాడు.

అంతేకాదు టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పనిచేసిన కోహ్లి.. ఎంఎస్‌ ధోని(60 మ్యాచ్‌లు) రికార్డును బ్రేక్‌ చేశాడు. కెప్టెన్‌గా కోహ్లి విజయాల శాతం 58.8గా ఉంది. టెస్టు క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు.  ఆ తర్వాత ధోని 27 టెస్టు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.

బలమైన ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలను లాంటి జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్‌లు సొంతం చేసుకున్న టీమిండియాను కోహ్లి ముందుండి నడిపించాడు. ఇక స్వదేశంలో టెస్టుల్లో టీమిండియాకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి 25 మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించగా.. తర్వాతి స్థానంలో ధోని (21 మ్యాచ్‌ల్లో విజయాలు) ఉన్నాడు.

ఇక కెప్టెన్‌గా 20 శతకాలు బాదిన కోహ్లి.. గ్రేమి స్మిత్‌(సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌) తర్వాత టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇక గ్రేమి స్మిత్‌ ప్రొటిస్‌ కెప్టెన్‌గా 25 శతకాలు బాదాడు

చదవండి: 'గొడవలు జరగడం ఇష్టం లేదు.. రేసు నుంచి తప్పుకుంటున్నా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement