చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి ఔటైన కోహ్లి.. భారత్‌లో 12000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
విరాట్‌కు ముందు సచిన్ టెండూల్కర్ మాత్రమే భారత్‌లో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సచిన్ భారత్‌లో 258 మ్యాచ్‌లు ఆడి 14192 పరుగులు చేశాడు. విరాట్ 219 మ్యాచ్‌ల్లో 12000 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్, విరాట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ (167 మ్యాచ్‌ల్లో 9004 పరుగులు), రోహిత్ శర్మ (179 మ్యాచ్‌ల్లో 8690 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (142 మ్యాచ్‌ల్లో 7691 పరుగులు) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లి (17) ఔట్ కాగా.. శుభ్‌మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, నహిద్ రాణా, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ పడగొట్టారు.
ప్రస్తుతం భారత్ 308 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని) కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.
రవిచంద్రన్ అశ్విన్ సూపర్ సెంచరీతో (113) చెలరేగగా.. రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. పంత్ (39) పర్వాలేదనిపించాడు. రోహిత్ (6), గిల్ (0), కోహ్లి (6), రాహుల్ (16) విఫలమయ్యారు. అశ్విన్-జడేజా జోడి ఏడో వికెట్‌కు 199 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 5, తస్కిన్ అహ్మద్ 3, నహిద్ రాణా, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment