వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులపై కన్నేశారు. హిట్‌మ్యాన్ మరో 175 పరుగులు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకోనుండగా.. విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13,000 పరుగుల క్లబ్‌లో చేరతాడు.
బార్బడస్ వేదికగా విండీస్‌తో రేపు (జులై 27) జరుగబోయే తొలి వన్డేలో విరాట్, రోహిత్‌లకు ఈ మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రోహిత్ 243 వన్డేల్లో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీల సాయంతో 9825 పరుగులు చేయగా.. కోహ్లి 274 వన్డేల్లో 46 సెంచరీ, 65 హాఫ్ సెంచరీల సాయంతో 12898 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, విండీస్‌తో ఇటీవల ముగిసిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో సునాయస విజయం సాధంచగా.. ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ఆఖరి రోజు మరో 8 వికెట్లు తీసి ఉంటే భారత్ విజయం సాధించేదే.
అయితే ఎడతెరిపి లేని వర్షం టీమిండియా విజయావకాశాలకు భారీ గండికొట్టింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. దీని ప్రభావం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌పై కూడా పడింది. విండీస్‌తో రెండో టెస్ట్ గెలిచుంటే భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేది.
విండీస్ పర్యటన విషయానికొస్తే.. 27న తొలి వన్డే ఆడే భారత్, ఆతర్వాత 29, ఆగస్ట్ 1 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఆగస్ట్ 3, 6, 8, 12, 13 తేదీల్లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా జరుగనుండగా.. రెండు, మూడు మ్యాచ్‌లు గయానాలో.. చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. అనంతరం టీమిండియా ఫ్లోరిడా నుంచి నేరుగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ భారత్ 3 టీ20లు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment