Irfan Pathan: జులై 22 నుంచి ప్రారంభంకానున్న విండీస్ టూర్‌కు (వన్డేలు) టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు రెస్ట్ ఇవ్వడంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. సెలెక్టర్లు తరుచూ సీనియర్లకు విశ్రాంతినివ్వడంపై ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. అసలే ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న కోహ్లి, రోహిత్‌లను విండీస్‌తో వన్డేలకు పక్కకు పెట్టడం ఎంత వరకు సబబని పరోక్షంగా ప్రశ్నించాడు. రెస్ట్ తీసుకుంటే ఏ ఆటగాడూ ఫామ్‌లోని రాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
No one comes back to form while resting…
— Irfan Pathan (@IrfanPathan) July 6, 2022
ఇర్ఫాన్ తన ట్వీట్‌లో కోహ్లి, రోహిత్‌ల పేర్లను ప్రస్తావించనప్పటికీ నెటిజన్లకు విషయం అర్ధమై సదరు ట్వీట్‌తో ఏకీభవిస్తున్నారు. ఈ విషయంలో ఇర్ఫాన్ వాదన కరెక్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో ఇర్ఫాన్ ట్వీట్‌కు మద్దతుగా భారీ ప్రచారం చేస్తున్నారు. ఇర్ఫాన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా, విండీస్‌తో మూడు వన్డేల కోసం 16 మంది సభ్యుల టీమిండియాను సెలెక్టర్లు నిన్న (జులై 6) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ నాయకత్వం వహించనున్నాడు.
ఇదిలా ఉంటే, సిరీస్‌కు ఓ కొత్త కెప్టెన్‌ను ప్రకటించడంపై కూడా టీమిండియా అభిమానులు, విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు.సెలెక్టర్లు తరుచూ కెప్టెన్లను మారుస్తూ టీమిండియాను సర్వనాశనం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. సోషల్‌మీడియాలో సెలెక్టర్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకే నెలలో ఒకే జట్టుకు నలుగురు కెప్టెన్లు ఏంటని నిలదీస్తున్నారు.
ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు రోహిత్ శర్మకు గాయం కావడంతో బుమ్రా సారధ్య బాధ్యతలు చేపట్టగా, కౌంటీ జట్లతో వార్మప్ మ్యాచ్‌లకు దినేశ్ కార్తీక్, ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ శర్మ, ఆతర్వాత విండీస్‌తో వన్డేలకు ధవన్ టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అంతకుముందు ఐర్లాండ్‌తో టీ20లకు హార్ధిక్ పాండ్య, స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్, సౌతాఫ్రికాలో సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారధులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్‌తో మూడు వన్డేలకు భారత జట్టు : శిఖర్ ధవన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
చదవండి: బజ్‌బాల్.. టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త మంత్ర
Comments
Please login to add a commentAdd a comment