IND VS WI 2nd T20: Suryakumar Yadav On Cusp Of Joining Rohit Sharma And Virat Kohli In Elite T20I List - Sakshi
Sakshi News home page

IND VS WI 2nd T20: భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్‌.. మూడేస్తే రోహిత్‌, విరాట్‌ సరసన చోటు

Published Sun, Aug 6 2023 5:30 PM | Last Updated on Sun, Aug 6 2023 5:42 PM

IND VS WI 2nd T20: Suryakumar Yadav On Cusp Of Joining Rohit Sharma And Virat Kohli In Elite Club - Sakshi

విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 6) జరుగనున్న రెండో టీ20కి ముందు టీమిండియా చిచ్చరపిడుగు, వరల్డ్‌ టీ20 నంబన్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. నేటి మ్యాచ్‌లో స్కై మరో 3 సిక్సర్లు బాదితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (182), విరాట్‌ కోహ్లిల (117) సరసన చేరతాడు. రోహిత్‌, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ టీ20ల్లో 100 అంత కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లుగా రికార్డుల్లో నిలువగా.. స్కై ఈ జాబితాలో చేరేందుకు మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.

49 అంతర్జాతీయ టీ20ల్లో స్కై ఇప్పటివరకు 97 సిక్సర్లు బాది, ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా.. 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు బాదిన కేఎల్‌ రాహుల్‌ మూడో ప్లేస్‌లో నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 12 మంది 100 సిక్సర్లు బాదగా.. వారిలో రోహిత్‌ అగ్రస్థానంలో, కోహ్లి ఏడో ప్లేస్‌లో ఉన్నారు. రోహిత్‌ తర్వాత మార్టిన్‌ గప్తిల్‌ (173), ఆరోన్‌ ఫించ్‌ (125), క్రిస్‌ గేల్‌ (124), పాల్‌ స్టిర్లింగ్‌ (123), ఇయాన్‌ మోర్గాన్‌ (120), జోస్‌ బట్లర్‌ (113), ఎవిన్‌ లూయిస్‌ (111), కొలిన్‌ మున్రో (107), మ్యాక్స్‌వెల్‌ (106), డేవిడ్‌ మిల్లర్‌ (106), డేవిడ్‌ వార్నర్‌ (105) ఉన్నారు. 

కాగా, అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను సిక్సర్‌తోనే ప్రారంభించిన సూర్యకుమార్‌.. అతి తక్కువ కాలంలో పలు టీ20 రికార్డులు తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అతి తక్కువ వ్యవధిలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గానూ ఎదిగాడు. టీ20 కెరీర్‌లో 47 ఇన్నింగ్స్‌లు ఆడిన స్కై.. 174.1 స్ట్రయిక్‌రేట్‌తో 3 సెంచరీలు, 13 అర్ధసెంచరీల సాయంతో 45.8 సగటున 1696 పరుగులు చేశాడు. స్కై ఖాతాలో 97 సిక్సర్లతో పాటు 152 బౌండరీలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్‌ 145 పరుగులకే పరిమితమైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో పూరన్‌ (41), కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ (48) రాణించగా.. భారత్‌ ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (39) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

భారత బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, చహల్‌ తలో 2 వికెట్లు, హార్దిక్‌, కుల్దీప్‌ చెరో వికెట్‌ పడగొట్టగా.. విండీస్‌ బౌలర్లు జేసన్‌ హోల్డర్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌, రొమారియో షెపర్డ్‌ తలో 2 వికెట్లు, అకీల్‌ హొసేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement