ఆసియా కప్-2023 ప్రారంభానికి ముందు పలువురు స్టార్ క్రికెటర్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏవంటే..
విరాట్ కోహ్లి: ఆసియా కప్-2023లో విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఫార్మాట్‌లో 13000 పరుగుల మార్కును అందుకున్న ఐదో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12898 పరుగులు ఉండగా.. అతనికి ముందు సచిన్ (18426), సంగక్కర (14234), పాంటింగ్ (13734), జయసూర్య (13430) ఈ ఘనత సాధించారు.
ఈ రికార్డుతో పాటు విరాట్ మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్‌లో అతను 13000 పరుగుల మార్కును అందుకుంటే, వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు సాధించిన రికార్డు సచిన్ (321 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా.. విరాట్ (265 ఇన్నింగ్స్‌లు) సచిన్ కంటే చాలా ముందే ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.
విరాట్ పై పేర్కొన్న రెండు భారీ రికార్డులతో పాటు మరో అత్యంత భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్-2023లో అతను మరో 4 సెంచరీలు చేస్తే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డును బద్దలు కొట్టి, సెంచరీల హాఫ్ సెంచరీని పూర్తి చేస్తాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 46 వన్డే సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ శర్మ: ఆసియా కప్ 2023లో రోహిత్ మరో 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10000 పరుగుల మార్కును అందుకుంటాడు. తద్వారా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 15వ క్రికెటర్‌గా.. ఆరో భారత క్రికెటర్ రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 9837 పరుగులు ఉన్నాయి.
ప్రస్తుత టోర్నీలో రోహిత్ మరో 255 పరుగులు చేస్తే, ఆసియా కప్‌లో (వన్డే ఫార్మాట్) 1000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. భారత క్రికెటర్లలో సచిన్ అత్యధికంగా ఆసియా కప్ వన్డే టోర్నీల్లో 971 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జయసూర్య, సంగక్కర మాత్రమే 1000 పరుగుల మైలురాయిని దాటారు.
రవీంద్ర జడేజా: ఆసియా కప్ 2023లో జడేజా (194) మరో 6 వికెట్లు తీస్తే, వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ విభాగంలో జయసూర్య అత్యధికంగా 323 వికెట్లు పడగొట్టాడు.
షకీబ్ అల్ హసన్: ప్రస్తుత ఆసియా కప్‌లో షకీబ్ మరో 168 పరుగులు చేస్తే, విదేశాల్లో 4000 పరుగుల మార్కును రెండో బంగ్లాదేశీగా రికార్డు సృష్టిస్తాడు. షకీబ్‌కు ముందు తమీమ్ ఇక్బాల్ (4323) ఈ ఘనత సాధించాడు.
అలాగే ప్రస్తుత టోర్నీలో షకీబ్ (305) మరో వికెట్ తీస్తే, అత్యధిక వికెట్లు సాధించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో డేనియల్ వెటోరీని (305) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకతాడు.
ఇమామ్ ఉల్ హాక్: ఇమామ్ ఈ ఆసియా కప్‌లో తదుపరి 4 మ్యాచ్‌ల్లో మరో 116 పరుగులు చేస్తే, వన్డేల్లో హషీమ్ ఆమ్లా ఝ(61) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఇమామ్ ఖాతాలో ప్రస్తుతం 62 ఇన్నింగ్స్‌ల్లో 2884 పరుగులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment