సిడ్నీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... మహిళల టి20 ప్రపంచకప్ కోసం అక్కడికి వెళ్లడం సరికాదని ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న దేశంపై ఇది మరింత ఒత్తిడి కలిగిస్తుందని హీలీ వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరత హింసకు దారితీయగా... వందలాది మంది మృత్యువాత పడ్డారు.
షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడగా... మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 19 వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
ఈ నేపథ్యంలో హీలీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆడటం కష్టంగా ఉంది. నైతికంగా ఇది సరైంది కాదనిపిస్తోంది. టోర్నీ అక్కడే నిర్వహించాలా వద్దా అనే విషయం ఐసీసీ పరిధిలోకి వస్తుంది. మా వరకైతే టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగ్గా సిద్ధమవుతున్నాం. టోర్నీ ఎక్కడ జరిగినా సత్తా చాటగలమనే నమ్మకం ఉంది’ అని పేర్కొంది. 2014 టి20 ప్రపంచకప్ తర్వాత.. ఇటీవలే ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించింది.
పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా ఆడిన 3 వన్డేలు, మూడు టి20ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్‌లో టి20 వరల్డ్‌కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై ఈరోజు ఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ వేదిక మార్చాలనుకుంటే మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్య రేసులో ముందుంది.
Comments
Please login to add a commentAdd a comment