ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో మరో బిగ్‌ వికెట్‌ డౌన్‌ | Mitchell Starc Out Of ICC Champions Trophy 2025 For Personal Reasons, Steve Smith To Lead Australia | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో మరో బిగ్‌ వికెట్‌ డౌన్‌

Published Wed, Feb 12 2025 9:16 AM | Last Updated on Wed, Feb 12 2025 10:34 AM

Starc Out Of Champions Trophy For Personal Reasons

ఛాంపియన్స్‌ ట్రోఫీకి (Champions Trophy) ముందు ఆస్ట్రేలియా జట్టులో పెద్ద మరో వికెట్‌ పడింది. స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) వ్యక్తిగత కారణాల చేత మెగా టోర్నీ మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్టార్క్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ తెలిపాడు. స్టార్క్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు శ్రీలంకతో జరిగే రెండు వన్డేల్లో కూడా పాల్గొనడని బెయిలీ ప్రకటించాడు. 

స్టార్క్‌కు ముందు గాయాల కారణంగా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ (Mitchell Marsh), కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (Pat Cummins), పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazzlewood) ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఈ మధ్యలో మరో ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ (Marcus Stoinis) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

స్టార్క్‌తో కలుపుకుని ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో మొత్తం ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని బెన్‌ డ్వార్షుయిష్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, స్పెన్సర్‌ జాన్సన్‌,తన్వీర్‌ సంఘా, సీన్‌ అబాట్‌లతో భర్తీ చేస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. కూపర్‌ కన్నోలీ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఉంటాడని పేర్కొంది. మార్పులు చేర్పుల తర్వాత ప్రకటించిన 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) సారథ్యం వహిస్తాడు.

కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇవాళ (ఫిబ్రవరి 12) ఆ జట్టు లంకతో వన్డే మ్యాచ్‌ ఆడుతుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ వన్డే జరుగుతుంది. రెండో వన్డే ఫిబ్రవరి 14న జరుగుతుంది. ప్రస్తుత లంక పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్ట్‌లు కూడా ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టే జయభేరి మోగించింది. రెండు వన్డేల సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా పాకిస్తాన్‌కు (ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం​) బయల్దేరుతుంది. 

ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్‌.. ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్‌.. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లతో కలిసి గ్రూప్‌-బిలో ఉంది. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లు పోటీపడతాయి.

2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్తాన్‌, దుబాయ్‌ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న జరుగనుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్‌, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]

శ్రీలంకతో రెండు వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్‌, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, కూపర్‌ కన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement