
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఇవాళ (మార్చి 2) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే ఈ మెగా టోర్నీలో భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (8-0-42-5) నమోదు చేసిన కివీస్ బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై అత్యుత్తమ గణాంకాలు
5/42 - మాట్ హెన్రీ, 2025
4/25 - నవీద్-ఉల్-హసన్, 2004
4/36 - షోయబ్ అక్తర్, 2004
4/62 - డగ్లస్ హోండో, 2002
ఈ మ్యాచ్‌లో హెన్రీ కీలకమైన శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వికెట్లతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వికెట్లు తీశాడు. స్కోర్ 15 పరుగుల వద్ద ఉండగానే గిల్‌ను ఔట్ చేసిన హెన్రీ భారత్‌ను తొలి దెబ్బ తీశాడు. అనంతరం గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్‌ను ఔట్ చేసి టీమిండియా కష్టాలను మరింత అధికం చేశాడు.
ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడుతున్న హార్దిక్‌ను ఔట్ చేసి భారత్ భారీ స్కోర్ చేయకుండా కళ్లెం వేశాడు. ఒక్కో పరుగు కీలకమైన తరుణంలో స్ట్రయిక్ రొటేట్ చేస్తున్న రవీంద్ర జడేజాను ఔట్ చేశాడు. చివరిగా షమీని ఔట్ చేసి కెరీర్‌లో మూడో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) మాత్రమే రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు.
రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
అనంతరం 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉంది. ఆ జట్టు 37 ఓవర్ల అనంతరం సగం వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 78 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (76) క్రీజ్‌లో పాతుకుపోయాడు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 22, రచిన్ రవీంద్ర 6, డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. విలియమ్సన్‌కు జతగా బ్రేస్‌వెల్ క్రీజ్‌లో ఉన్నాడు.