Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జద్రాన్‌.. రికార్డు శతకం.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌ | Champions Trophy 2025: Ibrahim Zadran Shines With Super Century, Afghanistan Sets Huge Target To England | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జద్రాన్‌.. రికార్డు శతకం.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌

Published Wed, Feb 26 2025 6:46 PM | Last Updated on Wed, Feb 26 2025 6:46 PM

Champions Trophy 2025: Ibrahim Zadran Shines With Super Century, Afghanistan Sets Huge Target To England

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా లాహోర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (Ibrahim Zadran) రికార్డు శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్‌ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్‌ (6), సెదికుల్లా అటల్‌ (4), రహ్మత్‌ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (41), మహ్మద్‌ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్‌ 2, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో అలరించిన జద్రాన్‌ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ (177) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌ పేరిట ఉండేది. డకెట్‌ ఇదే ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై 165 పరుగులు స్కోర్‌ చేశాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
ఇ‍బ్రహీం జద్రాన్‌-177
బెన్‌ డకెట్‌-165
నాథన్‌ ఆస్టల్‌-145 నాటౌట్‌
ఆండీ ఫ్లవర్‌-145
సౌరవ్‌ గంగూలీ-141 నాటౌట్‌
సచిన్‌ టెండూల్కర్‌-141
గ్రేమీ స్మిత్‌-141

ఈ సెంచరీతో జద్రాన్‌ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో కూడా జద్రాన్‌ పేరిటే ఉండేది. జద్రాన్‌ తన రికార్డును తనే సవరించుకున్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్‌ 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. 

వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
ఇబ్రహీం జద్రాన్‌-177 వర్సెస్‌ ఇంగ్లండ్‌, 2025
ఇబ్రహీం జద్రాన్‌-162 వర్సెస్‌ శ్రీలంక, 2022
రహ్మానుల్లా గుర్భాజ్‌-151 వర్సెస్‌ పాకిస్తాన్‌, 2023
అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌-149 నాటౌట్‌ వర్సెస్‌ శ్రీలంక, 2024
రహ్మానుల్లా గుర్భాజ్‌-145 వర్సెస్‌ బంగ్లాదేశ్‌, 2023

ఈ సెంచరీతో జద్రాన్‌ రెండు ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్‌.. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. జద్రాన్‌.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్‌ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్‌ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ రికార్డులతో పాటు జద్రాన్‌ మరో ఘనత కూడా సాధించాడు. పాక్‌ గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్‌ చేసిన ఘనత గ్యారీ కిర​్‌స్టన్‌కు దక్కుతుంది. 1996 వరల్డ్‌కప్‌లో కిర్‌స్టన్‌ యూఏఈపై 188 పరుగులు (నాటౌట్‌) చేశాడు.

పాక్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..
గ్యారీ కిర్‌స్టన్‌-188 నాటౌట్‌
వివియన్‌ రిచర్డ్స్‌-181
ఫకర్‌ జమాన్‌-180 నాటౌట్‌
ఇబ్రహీం జద్రాన్‌-177
బెన్‌ డకెట్‌-165
ఆండ్రూ హడ్సన్‌-161

జద్రాన్‌ అద్భుత పోరాటం​
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌.. ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్‌.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్‌ షాను (4) ఔట్‌ చేశాడు. ఈ దశలో జద్రాన్‌.. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 

సెంచరీ వరకు ఆచితూచి ఆడిన జద్రాన్‌.. ఆతర్వాత శివాలెత్తిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.   లివింగ్‌స్టోన్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ తొలి బంతికి జద్రాన్‌ ఔటయ్యాడు. జద్రాన్‌ ఔట్‌ కాపోయుంటే ఆఫ్ఘనిస్తాన్‌ ఇంకా భారీ స్కోర్‌ చేసేది. ఇదే ఓవర్‌లో నబీ కూడా ఔట్‌ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఓవర్‌లో కేవలం​ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement