
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయమైనట్లు తెలుస్తుంది. ఇవాళ (మార్చి 8) ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా విరాట్ గాయపడినట్లు జియో న్యూస్ తెలిపింది. నెట్స్‌లో ఓ పేసర్‌ను ఎదుర్కొనే క్రమంలో విరాట్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడిన అనంతరం విరాట్ ప్రాక్టీస్‌ను ఆపేసినట్లు తెలుస్తుంది. విరాట్ గాయానికి ఫిజియో చికిత్స చేశాడని సమాచారం.
చికిత్స తర్వాత విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లకుండా మైదానంలోనే సహచరులతో గడిపినట్లు తెలుస్తుంది. విరాట్ గాయంపై కోచింగ్ స్టాఫ్‌ను ఆరా తీయగా తీవ్రమైంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ మోకాలికి కట్టు కట్టుకుని తిరిగినట్లు జియో న్యూస్ పేర్కొంది.
విరాట్ గాయం గురించి తెలిసి అభిమానులు తొలుత ఆందోళన చెందారు. విరాట్ గాయంపై టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్లో విరాట్ ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకవేళ స్వల్ప గాయమైనా ముందు జాగ్రత్త చర్చగా విరాట్‌ను ప్రాక్టీస్ చేయనిచ్చి ఉండరు.
ఈ టోర్నీలో విరాట్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో విరాట్ దాయాది పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ విరాట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా విరాట్ సెంచరీ చేసుండాల్సింది. అయితే తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
విరాట్ సూపర్ ఫామ్‌ను ఫైనల్లోనూ కొనసాగించి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్లో విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడితే భారత విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. దుబాయ్ పిచ్‌లకు విరాట్ అలవాటు పడ్డాడు కాబట్టి ఫైనల్లో తప్పక రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు.
కాగా, దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.
మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను న్యూజిలాండ్‌పై అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌ను గ్రూప్ దశలో ఓడించినప్పటికీ.. ఫైనల్లో ఓడించడం మాత్రం అంత ఈజీ కాదు.
ఐసీసీ ఈవెంట్లలో (అన్ని ఫార్మాట్లలో) న్యూజిలాండ్ భారత్‌తో ఆడిన 16 మ్యాచ్‌ల్లో పదింట గెలిచింది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌పై న్యూజిలాండ్‌కు మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ నాకౌట్స్‌లో భారత్, న్యూజిలాండ్ నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. 3 మ్యాచ్‌ల్లో కివీస్, ఒక మ్యాచ్‌లో భారత్ గెలుపొందాయి.
న్యూజిలాండ్ తమ చరిత్రలో గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లు భారత్‌పైనే (ఫైనల్స్‌లో) సాధించినవే కావడం గమనార్హం. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ తమ రెండో ఐసీసీ టైటిల్‌ను 2021లో సాధించింది. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.