
భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 95 పరుగులు చేస్తే వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ వన్డేల్లో న్యూజిలాండ్‌పై 1750 పరుగులు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 1656 పరుగులు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో (ఫైనల్లో) విరాట్ సెంచరీ సాధిస్తే.. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరూ వన్డేల్లో న్యూజిలాండ్‌పై చెరో 6 సెంచరీలు బాదారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 128 పరుగులు చేస్తే.. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ 657 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 530 పరుగులు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు. సచిన్ ఐసీసీ నాకౌట్స్‌లో ఆరు అర్ద సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో ఐదు అర్ద శతకాలు ఉన్నాయి.
ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే పైన ఉన్న మూడు రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విరాట్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 72.33 సగటున, 83.14 స్ట్రయిక్‌రేట్‌తో 217 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఫైనల్లో విరాట్ సెంచరీ చేస్తే వన్డేల్లో 52వ శతకం.. ఓవరాల్‌గా 83వ శతకం అవుతుంది.
విరాట్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీమిండియాకు కృష్ణార్జులు లాంటి రోహిత్, కోహ్లి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని యావత్ భారతం ఆశిస్తుంది.
టీమిండియాకు చెడు సూచకం
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు చెడు సూచిస్తుంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న ప్రతిసారి భారత్‌కు అపజయమే ఎదురైంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు రెండు సార్లు ఎదురెదురుపడ్డాయి.
తొలిసారి ఈ ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఎడిషన్ ఫైనల్లో తలపడ్డాయి. నాడు న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి పోటీపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment