
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) ఖాతాలో మరో వరల్డ్ రికార్డు (World Record) చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో 300 వన్డేల మైలురాయిని తాకిన విరాట్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వన్డేలు, 100కు పైగా టెస్ట్‌లు, 100కు పైగా టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ ఇతర క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు.
విరాట్ ఇప్పటివరకు 300 వన్డేలు, 123 టెస్ట్‌లు, 125 టీ20లు ఆడాడు. భారత్ తరఫున 300 వన్డేలు ఆడిన ఏడో క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌కు ముందు సచిన్ టెండూల్కర్ (463), ఎంఎస్ ధోని (350), రాహుల్ ద్రవిడ్ (344), మహ్మద్ అజారుద్దీన్ (334), సౌరవ్ గంగూలీ (311), యువరాజ్ సింగ్ (304) భారత్ తరఫున 300 వన్డేల మైలురాయిని తాకారు.
కాగా, విరాట్ తన 300 వన్డేలో కేవలం 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని క్యాచ్‌తో విరాట్‌ను పెవిలియన్‌కు పంపాడు. గత మ్యాచ్‌లో విరాట్ పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ 52 పరుగులు చేసుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది.
ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు. ప్రస్తుతం (ఈ మ్యాచ్‌తో కలుపుకుని) విరాట్ ఖాతాలో 662 పరుగులు ఉన్నాయి (ఛాంపియన్స్ ట్రోఫీలో).
ఓవరాల్‌గా విరాట్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో సచిన్ (18426), సంగక్కర (14234) మత్రమే విరాట్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. విరాట్ ఇప్పటివరకు 288 ఇన్నింగ్స్‌లు ఆడి 14096 పరుగులు చేశాడు. విరాట్ ఇటీవలే వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పాక్‌పై సెంచరీతో వన్డేల్లో విరాట్ సెంచరీల సంఖ్య 51కి చేరింది. ప్రపంచ క్రికెట్‌లో ఇన్ని సెంచరీలు (50కిపైగా) ఎవరూ చేయలేదు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు.
రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్‌లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది.