అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్‌.. పాంటింగ్‌ సరసన చోటు | Champions Trophy 2025: Virat Kohli Joins Ricky Ponting In Most ICC Trophies Winning List | Sakshi
Sakshi News home page

అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్‌.. పాంటింగ్‌ సరసన చోటు

Published Tue, Mar 11 2025 10:32 AM | Last Updated on Tue, Mar 11 2025 11:06 AM

Champions Trophy 2025: Virat Kohli Joins Ricky Ponting In Most ICC Trophies Winning List

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025తో టీమిండియా ఖాతాలో ఏడో ఐసీసీ ట్రోఫీ చేరింది. భారత్‌ తొలిసారి 1983లో ఐసీసీ ట్రోఫీ (వన్డే వరల్డ్‌కప్‌) గెలిచింది. ఆతర్వాత 2002 (ఛాంపియన్స్‌ ట్రోఫీ, శ్రీలంకతో సంయుక్తంగా), 2007 (టీ20 వరల్డ్‌కప్‌), 2011 (వన్డే వరల్డ్‌కప్‌), 2013 (ఛాంపియన్స్‌ ట్రోఫీ), 2024 (టీ20 వరల్డ్‌కప్‌), 2025లో (ఛాంపియన్స్‌ ట్రోఫీ) ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్ల జాబితాలో భారత్‌ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియా అత్యధికంగా 10 ఐసీసీ ట్రోఫీలు (1987, 1999, 2003, 2007, 2015, 2023 వన్డే వరల్డ​్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్‌.. 2006, 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీ.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్‌) కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, భారత్‌ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత వెస్టిండీస్‌కు దక్కుతుంది. విండీస్‌ మొత్తంగా ఐదు ఐసీసీ టైటిళ్లు (1975, 1979 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2012, 2016 టీ20 వరల్డ​్‌కప్‌లు.. 2004 ఛాంపియన్స్‌ ట్రోఫీ) సాధించింది.

విండీస్‌ తర్వాత పాకిస్తాన్‌ (1992 వన్డే వరల్డ్‌కప్‌.. 2009 టీ20 వరల్డ్‌కప్‌.. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ), శ్రీలంక (1996 వన్డే వరల్డ్‌కప్‌.. 2014 టీ20 వరల్డ్‌కప్‌.. 2002 ఛాంపియన్స్‌ ట్రోఫీ (భారత్‌తో కలిసి సంయుక్తంగా), ఇంగ్లండ్‌ (2019 వన్డే వరల్డ్‌కప్‌.. 2010, 2022 టీ20 వరల్డ్‌కప్‌లు) తలో మూడు ఐసీసీ టైటిళ్లు సాధించాయి. న్యూజిలాండ్‌ రెండు (2000 ఛాంపియన్స్‌ ట్రోఫీ.. 2019-2021 డబ్ల్యూటీసీ), సౌతాఫ్రికా ఓ ఐసీసీ టైటిల్‌ (1998 ఛాంపియన్స్‌ ట్రోఫీ) గెలిచింది.

ఐసీసీ టైటిళ్లు గెలిచిన జట్ల విషయం ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి దక్కుతుంది. ఈ ఇద్దరు తలో ఐదు ఐసీసీ టైటిళ్లు (అండర్‌-19 ఈవెంట్లు కలుపుకొని) సాధించారు. పాంటింగ్‌ 1999, 2003,2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీలు గెలువగా.. విరాట్‌ 2008 అండర్‌ 19 వరల్డ్‌కప్‌.. 2011 వన్డే వరల్డ్‌కప్‌.. 2013, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలు.. 2024 టీ20 వరల్డ్‌కప్‌ టైటిళ్లు గెలిచాడు.

పాంటింగ్‌, విరాట్‌ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత రోహిత్‌ శర్మ (2007, 2024 టీ20 వరల్డ్‌కప్‌లు.. 2013, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలు), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్‌ ట్రోఫీ), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్‌ ట్రోఫీ), షేన్‌ వాట్సన్‌ (2007, 2015 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీలు), డేవిడ్‌ వార్నర్‌ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్‌.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్‌), మిచెల్‌ స్టార్క్‌ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్‌.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్‌), స్టీవ్‌ స్మిత్‌కు (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్‌.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్‌) దక్కుతుంది. వీరంతా తలో నాలుగు ఐసీసీ టైటిళ్లు గెలిచారు.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడో ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను, ఓవరాల్‌గా ఏడో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement