పాంటింగ్‌ను దాటేసిన కోహ్లి.. ఇక మిగిలింది సంగక్కర, సచిన్‌ మాత్రమే..! | Champions Trophy 2025 IND VS PAK: Virat Kohli Surpasses Ricky Ponting In ALL Time Run Scorer List Across Formats, See Details | Sakshi
Sakshi News home page

పాంటింగ్‌ను దాటేసిన కోహ్లి.. ఇక మిగిలింది సంగక్కర, సచిన్‌ మాత్రమే..!

Published Mon, Feb 24 2025 12:10 PM | Last Updated on Mon, Feb 24 2025 1:01 PM

Champions Trophy 2025, IND VS PAK: Virat Kohli Surpasses Ricky Ponting In ALL Time Run Scorer List Across Formats

పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌-3లోకి చేరాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో (India Vs Pakistan) సెంచరీ చేసిన విరాట్‌.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను (Ricky Ponting) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. 

ఈ జాబితాలో బ్యాటింగ్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో.. లంక దిగ్గజ బ్యాటర్‌ కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ మరో 514 పరుగులు చేస్తే సంగక్కరను కూడా వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్స్‌
సచిన్‌ టెండూల్కర్‌- 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు
కుమార సంగక్కర- 666 ఇన్నింగ్స్‌ల్లో 28016
విరాట్‌ కోహ్లి- 614 ఇన్నింగ్స్‌ల్లో 27503
రికీ పాంటింగ్‌- 668 ఇన్నింగ్స్‌ల్లో 27483
మహేళ జయవర్దనే- 725 ఇన్నింగ్స్‌ల్లో 25957

కాగా, పాక్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ మరో అరుదైన మైలురాయిని కూడా దాటాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద వన్డేల్లో 14000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. విరాట్‌కు ముందు సచిన్‌ (18426), సంగక్కర్‌ (14234) మాత్రమే వన్డేల్లో 14000 పరుగుల మార్కును దాటారు. 

ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్‌ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. సచిన్‌ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్‌ కేవలం 287వ ఇన్నింగ్స్‌ల్లో 14000 పరుగులు పూర్తి చేశాడు.

వన్డేల్లో 51వ సెంచరీ
నిన్నటి మ్యాచ్‌లో పాక్‌పై సెంచరీతో విరాట్‌ వన్డే సెంచరీల సంఖ్య 51కి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్‌ సెంచరీల సంఖ్య 82కు చేరింది. ప్రపంచ ​క్రికెట్‌లో సెంచరీల సంఖ్యా పరంగా సచిన్‌ (100) ఒక్కడే విరాట్‌ కంటే ముందున్నాడు.

విరాట్‌ సూపర్‌ సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన భారత్‌
విరాట్‌ సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో నిన్నటి మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ అజేయ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ రిజ్వాన్‌ (46), ఖుష్దిల్‌ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 

ఇమామ్‌ ఉల్‌ హక్‌ 10, బాబర్‌ ఆజమ్‌ 23, సల్మాన్‌ అఘా 19, తయ్యబ్‌ తాహిర్‌ 4, షాహీన్‌ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్‌ రౌఫ్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ 3, హార్దిక్‌ 2, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్‌; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. 

ఓపెనర్లు రోహిత్‌ శర్మ (20), శుభ్‌మన్‌ గిల్‌ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్‌ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్‌ అహ్మద్‌, ఖుష్దిల్‌ షా తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస  పరాజయాలతో పాక్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement