
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఆర్ దేవరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దేవరాజ్ తల్లి కమలేశ్వరి ఇవాళ (మార్చి 2) ఉదయం మృతి చెంచారు. దీంతో దేవరాజ్ భారత బృందాన్ని వదిలి హైదరాబాద్‌కు బయల్దేరారు. దేవరాజ్ తిరిగి టీమిండియాతో కలుస్తారా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. మంగళవారం జరిగే సెమీఫైనల్ ఫలితంపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది.
దేవరాజ్ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. దేవరాజ్ తల్లి మృతి పట్ల హెచ్‌సీఏ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో తెలిపింది. దేవరాజ్ ఇటీవలే టీమిండియా మేనేజర్ ఎంపికయ్యారు.
ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) మాత్రమే రాణించారు.
భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్‌లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది.