
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 165 పరుగులు స్కోర్ చేసిన డకెట్.. ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్ నుంచి 165 పరుగుల స్కోర్ నమోదైంది. డకెట్‌కు ముందు వన్డేల్లో ఎవరూ ఈ సంఖ్యను (165) నమోదు చేయలేదు. తాజాగా డకెట్ 165 పరుగుల స్కోర్ చేయడంతో వన్డేల్లో 0 నుంచి 183 పరుగుల వరకు స్కోర్లు కనీసం ఒక్కసారైనా నమోదైనట్లైంది.
ఈ మ్యాచ్‌లో 165 పరుగులు స్కోర్ చేయడంతో డకెట్ మరిన్ని రికార్డులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టిల్ (145), జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్ (145 నాటౌట్) పేరిట ఉండింది.
అలాగే ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగానూ డకెట్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (141) పేరిట ఉండింది.
తాజా ప్రదర్శనతో డకెట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు జో రూట్ (133 నాటౌట్) పేరిట ఉండింది.
మ్యాచ్ విషయానికొస్తే.. డకెట్ రికార్డు సెంచరీ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టీమ్ స్కోర్ (356/5) కూడా ఇదే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్ (68) అర్ద శతకంతో రాణించాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (10 బంతులోల 21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ 350 పరుగుల మార్కును తాకగలిగింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్ 3, లబూషేన్, జంపా తలో 2, మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. జోస్ ఇంగ్లిస్ మెరుపు శతకంతో (120 నాటౌట్) విజృంభించడంతో మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మాథ్యూ షార్ట్ (63), అలెక్స్ క్యారీ (69), లబూషేన్ (47), మ్యాక్స్‌వెల్ (32 నాటౌట్) ఇంగ్లిస్‌కు సహకరించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్, ఆర్చర్, కార్స్, రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు.