
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (Champions Trophy) టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది. ఫీల్డింగ్‌లో నిరాశపరిచినా బౌలర్లు, బ్యాటర్లు టీమిండియాకు విజయం చేకూర్చారు.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ను ఓడించడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లా బ్యాటర్లు హృదయ్, జాకిర్ అలీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. వారిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని అభినందించాడు. షమీ ఐదు వికెట్ల ప్రదర్శనను కొనియాడాడు. ఇలాంటి ప్రదర్శనల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని అన్నాడు. షమీ సామర్థ్యం గురంచి తెలుసని చెప్పాడు.
జట్టుకు అవసరమైన ప్రతిసారి షమీ అద్భుత ప్రదర్శనలతో ముందుకొస్తాడని కితాబునిచ్చాడు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌ను కూడా ప్రశంసించాడు. గిల్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు ఆశ్చర్యానికి గురి చేయవని అన్నాడు. గిల్ స్థాయి ఏంటో తమకు తెలుసని తెలిపాడు. అతనో క్లాసికల్ ప్లేయర్ అని కొనియాడాడు. గిల్ చివరి వరకు క్రీజ్‌లో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
అక్షర్ హ్యాట్రిక్‌ను నేలపాలు చేయడంపై స్పందిస్తూ.. అది చాలా సులభమైన క్యాచ్. నా స్థాయి క్రికెటర్ అలాంటి క్యాచ్‌ను తప్పక పట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగలేదు. సునాయాసమైన క్యాచ్‌ను వదిలేసినందుకు చింతిస్తున్నాను. అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు చాలా బాధేసింది. రేపు అతన్ని డిన్నర్‌కు తీసుకెళ్తానంటూ నవ్వులు పూయించాడు.
పిచ్ తీరుపై స్పందిస్తూ.. ఊహించిన దానికంటే నిదానంగా ఉందని అన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో కూడా పిచ్ ఇలాగే ఉంటుందని చెప్పలేమని తెలిపాడు. ఒక్క మ్యాచ్‌తోనే పిచ్‌ను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నాడు. ముందుగా పిచ్ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను క్యూరేటర్‌ను కాదని జోక్ చేశాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉంటుందని, జట్టుగా మేము దాన్ని అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.
అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ (22), శ్రేయస్ (15), అక్షర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 23న దుబాయ్‌లోనే జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment