
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) 1000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 38 పరుగులు చేసి ఔటైన డకెట్.. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనత సాధించాడు.
21 ఇన్నింగ్స్‌ల్లో 6 అర్ద సెంచరీలు, 3 సెంచరీల సాయంతో 1000 పరుగులు పూర్తి చేసుకున్న డకెట్.. ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును డకెట్.. కెవిన్ పీటర్సన్, జోనాథన్ ట్రాట్, డేవిడ్ మలాన్‌తో కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు కూడా 21 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మార్కును తాకారు.
ఓవరాల్‌గా ఈ రికార్డును డకెట్.. వివ్ రిచర్డ్స్, క్వింటన్ డికాక్, బాబర్ ఆజమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్‌లతో కూడా షేర్ చేసుకున్నాడు. వీరు కూడా 21 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న రికార్డు పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ పేరిట ఉంది.
జమాన్ కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఫకర్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రికార్డు ఇమామ్ ఉల్ హాక్, శుభ్‌మన్ గిల్ పేరిట ఉంది. వీరిద్దరు 1000 పరుగులు పూర్తి చేసేందుకు 19 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.
కెరీర్‌లో తొలి 1000 పరుగులు పూర్తి చేసేందుకు అత్యధిక సమయం తీసుకున్న బ్యాటర్‌గా డకెట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2016 అక్టోబర్‌లో తొలి వన్డే ఆడిన డకెట్.. 8 ఏళ్ల 143 రోజుల తర్వాత 1000 పరుగులు పూర్తి చేశాడు. డకెట్ తర్వాత 1000 పరుగులు పూర్తి చేసేందుకు సుదీర్ఘ సమయం తీసుకున్న ఆటగాడిగా టెంబా బవుమా నిలిచాడు. బవుమా 6 ఏళ్ల 174 రోజుల వ్యవధిలో తన తొలి 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు.
జద్రాన్ రికార్డు సెంచరీ.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 27 ఓవర్ల అనంతరం 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 12, బెన్ డకెట్ 38, జేమీ స్మిత్ 9, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేసి ఔట్ కాగా.. జో రూట్ (52), జోస్ బట్లర్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నబీ 2, ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందాలంటే 23 ఓవర్లలో మరో 173 పరుగులు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment