
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో నిన్న (ఫిబ్రవరి 23) పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి దాయాదిని మట్టికరిపించింది. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి సూపర్ సెంచరీతో మెరిసి భారత్‌ను గెలిపించాడు. బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
కోహ్లి మ్యాచ్ విన్నింగ్ సెంచరీని విశ్వవాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లి సెంచరీ అనంతరం పాక్‌లోనూ సంబరాలు జరిగాయి. అసలైన క్రికెట్ అభిమానులు భారత్-పాక్ మధ్య ఉన్న అంతరాలను మరిచి క్రికెట్‌ను ఆస్వాధించారు. మ్యాచ్‌కు వేదిక అయిన దుబాయ్ స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది.
Suryakumar Yadav poses with a Pakistani fan 🇵🇰🇮🇳♥️#INDvsPAK #ChampionsTrophy2025 pic.twitter.com/CUHBhOjWM3
— Ahtasham Riaz (@ahtashamriaz22) February 23, 2025
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో ఫోటో కోసం ఓ పాక్ మహిళా అభిమాని ఎగబడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అభిమానం ఎల్లలు దాటడమంటే ఇదేనేమో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు భారత క్రికెటర్లతో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.