
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి (England White Ball Captaincy) జోస్ బట్లర్ (Jos Buttler) రాజీనామా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నేపథ్‌యంలో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సౌతాఫ్రికాతో రేపు (మార్చి 1) జరుగబోయే మ్యాచ్ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బట్లర్‌కు చివరిది. 2022 జూన్‌లో బట్లర్ ఇంగ్లండ్ ఫుల్ టైమ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇయాన్ మోర్గాన్ నుంచి బట్లర్ బాధ్యతలు స్వీకరించాడు.
బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ వన్డేల్లో దారుణంగా విఫలమైంది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచి 22 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచి, సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించింది. వన్డే వరల్డ్‌కప్ తర్వాత బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ 17లో 13 వన్డేలు ఓడింది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అనంతరం రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ పూర్తయిన వెంటనే బట్లర్ రాజీనామా విషయమై హింట్ ఇచ్చాడు. తాజాగా అధికారికంగా తన రాజీనామాను ప్రకటించాడు.
భారత్ సిరీస్‌లోనూ ఘోర పరాభవం
బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత పర్యటనలోనూ దారుణంగా విఫలమైంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో (క్లీన్ స్వీప్) కోల్పోయింది. భారత్‌తో సిరీస్‌లు ముగిసిన వెంటనే బట్లర్‌పై విమర్శలు తారాస్థాయికి చేరాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపించాయి.
వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమవుతున్న బట్లర్
పరిమిత ఓవర్లలో జట్టును విజయవంతంగా నడిపించలేకపోయిన బట్లర్.. వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమయ్యాడు. బట్లర్ బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ జాలువారి చాలాకాలం అయ్యింది. భారత్ పర్యటనలో.. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బట్లర్ తేలిపోయాడు.
ఫామ్ లేమితో సతమతమవుతున్న బట్లర్ గాయాలతోనూ వేధించబడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ నాయకత్వంలో టైటిల్ నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఇంగ్లండ్ తదుపరి వైట్ బాల్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను నియమించాలని ఆ దేశ అభిమానలు కోరుకుంటున్నారు.