
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్‌ల్లో ఓడింది. మూడు మ్యాచ్‌లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.
కెప్టెన్‌గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్‌ల్లో వచ్చాయి. కెప్టెన్‌గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్‌తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్‌లో ఆసీస్‌కు 324 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.
2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం
2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్‌కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.
11000 పరుగుల క్లబ్‌లో రోహిత్
ఈ మ్యాచ్‌లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా.. రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment