
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇందులో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగాడు. మొత్తం 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(120) సెంచరీతో మెరవగా.. డకెట్(38), జెమీ ఓవర్టన్(32) పరుగులు చేశారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో రాణించాడు. మహ్మద్ నబీ 2 వికెట్లు సాధించగా, ఫజల్హాక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయబ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.