![All Eyes On Harshit Rana In Champions Trophy](/styles/webp/s3/article_images/2025/02/16/rana.jpg.webp?itok=yqsBKLGa)
గత సంవత్సరం టి20 ప్రపంచ కప్‌లో విజయం తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్, పాకిస్తాన్‌లలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీపై భారత్ గురి పెట్టింది. తమ తొలి మ్యాచ్‌లో భారత్ ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది.
ఈ టోర్నమెంట్ కోసం భారత క్రీడాకారులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. భారత్ జట్టు ఎంపికపై పెద్దగా వివాదం లేకపోయినా, జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో టోర్నమెంట్ కి దూరం కావడంతో అతని స్తానం లో జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాపైనే ఆసక్తి రేకెత్తుతోంది.
సిరాజ్‌ను మినహాయించడం ఆశ్చర్యకరం
సిరాజ్‌ను జట్టు నుంచి మినహాయించడం చాలా ఆశ్చర్యకరం కలిగించింది. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు మేనేజిమెంట్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, మరీ దారుణంగా విఫలం కాలేదు. పైగా రాణా తో పోలిస్తే సిరాజ్ చాలా అనుభవం గడించాడు. సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడాడు. 24.04 సగటు తో 5.18 ఎకానమీతో 71 వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్ దాదాపు 2022 ప్రారంభం నుండి 2024 చివరి వరకు భారత్ తరఫున వన్డే ల్లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా ఖ్యాతి గడించాడు. ఈ నేపధ్యంలో జట్టు మేనేజిమెంట్ కి సిరాజ్ స్థానంలో రాణా ఎందుకు మెరుగ్గా కనిపించాడు..?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక జట్టుని ప్రకటించిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ .."సిరాజ్ ఆడకపోవడం దురదృష్టకరమని అన్నాడు. బుమ్రా లేకపోవడంతో డెత్-బౌలింగ్ నైపుణ్యం ఉన్న ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అవకాశం కల్పించామని తెలిపాడు. షమీ ఫిట్‌నెస్ సాధించడంతో సిరాజ్ కి చోటు కల్పించలేక పోయామని చెప్పాడు. అయితే సిరాజ్ డెత్ బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయిన కారణంగానే జట్టుకి దూరమయ్యాడనేది వాస్తవం.
ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిన రాణా
ఇక రాణా విషయానికొస్తే, ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చాడు. "బుమ్రా లేని కారణంగా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కి కొత్తదనం కావాలి. రాణాలో మాకు ఆ సామర్ధ్యం కనిపించింది. ఇంగ్లాండ్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో రాణా తన తొలి ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. రెండవ ఓవర్ మెయిడెన్ వేసిన తర్వాత మూడవ ఓవర్‌లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు సాధించాడు. అయితే సాల్ట్ అవుటైన తర్వాత మళ్ళీ బౌలింగ్ కి వచ్చిన రాణా వెంటనే తన 6'2" అడుగుల ఎత్తుని అనువుగా ఉపయోగించుకొని ప్రతి దాడి చేసాడు.
140kph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి తన ప్రభావం చూపడం ప్రారంభించాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేసి వన్డేల్లో తన తొలి వికెట్‌ను నమోదు చేసుకున్నాడు. 22 ఏళ్ల వయసులో ఉన్న రాణా తన నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్దు కుంటున్నాడు. పేస్ బౌలర్ గా రాణించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో రాణా చెప్పుకోదగ్గ రీతిలో రాణించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఎలా రాణిస్తాడన్నదాని పైనే జట్టులో రాణాని కొనసాగించడం ఆధారపడి ఉంటుంది.
ఈ దశలోనే సిరాజ్ కి భారత్ జట్టు ద్వారాలు మూసుకొని పోయాయని చెప్పడం కష్టమే. బుమ్రా, షమీ లను మినహాయిస్తే సిరాజ్ ని సవాలు చేయగల సత్తా ప్రస్తుత భారత్ జట్టులో చాలా తక్కువ మందికి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ బెంచ్ సభ్యులలో ఒకడైన సిరాజ్ మళ్ళీ త్వరలోనే జట్టులోకి వస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో రాణా ఎలా రాణిస్తాడనేదే ప్రస్తుతం ఆసక్తి కలిగించే విషయం.
Comments
Please login to add a commentAdd a comment